వివేకా హత్య కేసులో సంచలనం: 8 కోట్ల సుపారీ, 9 మంది వ్యక్తులు

By Siva KodatiFirst Published Jul 23, 2021, 5:30 PM IST
Highlights

వైఎస్ వివేకా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఆయనను హతమార్చేందుకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు సీబీఐ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. 
 

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. వివేకా హత్యకు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్లు తేలింది. ఇద్దరు ప్రముఖులు ఈ మొత్తాన్ని అందజేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి దాదాపు 45 రోజులుగా సీబీఐ బృందం కడప జిల్లాలో మకాం వేసి విచారణ జరుపుతోంది. సుమారు 1600 మందికి పైగా విచారించారు. వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారం మేరకు కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్లుగా రంగయ్య జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఆ వాంగ్మూలమే కీలకంగా మారబోతోంది. సుపారీ ఇచ్చిన ఇద్దరితో పాటు మొత్తం 8 మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు రంగయ్య వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వాంగ్మూలం ప్రకారం సీబీఐ అధికారులు ముందుకు వెళ్లే అవకాశం వుంది. 

హత్య జరిగిన రోజు ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చారని రంగయ్య తన వాంగ్మూలంలో చెప్పారు. ఆ ఐదుగురు ఎవరనే విషయంపై సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, సిబిఐ దర్యాప్తు అధికారిగా కర్ణాటకకు చెందిన సుధా సింగ్ ను తప్పించి ఆమె స్థానంలో రామ్ కుమార్ ను నియమించారు. రాత్రికి తర్వాత ఆ మార్పు జరిగింది.

దీంతో వివేకా హత్య కేసులో సిబిఐ అధికారులు పురోగతి సాధించారు. రంగయ్య వాంగ్మూలం ద్వారా కేసు దర్యాప్తునకు తగిన ఆధారాలు సిబిఐకి లభించినట్లయింది. 

click me!