YS Vivekananda Reddy Murder case ...ఆ రోజు ఉమాశంకర్ రెడ్డి రోడ్డుపై పరుగెత్తారు: సీబీఐ

By narsimha lodeFirst Published Nov 7, 2021, 9:52 AM IST
Highlights

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డిది కీలక పాత్ర అని సీబీఐ అధికారులు తెలిపారు.ఈ విషయమై ఉమా శంకర్ రెడ్డి పాత్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని సీబీఐ కోర్టుకు అందించింది. ఉమా శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

కడప:మాజీ మంత్రి YS Vivekananda Reddy హత్య కేసులో Cbi అధికారులు కోర్టకు కీలక వివరాలను సమర్పించారు. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న Rangaiah వాంగ్మూలం మేరకు సీబీఐ అధికారులు కోర్టుకు ఈ వివరాలను అందించారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇటీవలనే నలుగురిపై సీబీఐ అధికారులు అభియోగాలు మోపారు. దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గంగిరెడ్డిలపై సీబీఐ అభియోగాలు మోపింది.

ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగయ్య సాక్ష్యం ఆధారంగా సీబీఐ అధికారులు కీలక సమాచారాన్ని కోర్టుకు సమర్పించారు. 2019 మార్చి 14వ తేదీన రాత్రి వివేకానందరెడ్డి హత్య జరిగింది. హత్య జరిగిన రోజున వివేకానందరెడ్డి ఇంటికి సమీపంలోని ఉన్న దుకాణం వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఉమాశంకర్ రెడ్డి పరుగు తీసినట్టుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపారు.

also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య: నలుగురిపై సీబీఐ అభియోగం, ఛార్జిషీట్ దాఖలు

ఈ కేసులో అరెస్టైన Uma shankar reddy బెయిల్ పిటిషన్ సందర్భంగా సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.ఈ హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ అధికారులు ప్రస్తావించారు.ఈ మేరకు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు సీబీఐ అధికారులు.

Bail పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ తరపున ప్రత్యేక  పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలను విన్పించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. ఈ కారణంగానే ఆయన నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు కూడా అంగీకరించేలేదని కోర్టుకు సీబీఐ  తరపు న్యాయవాది తెలిపారు.

ఉమాశంకర్ రెడ్డికి సంబంధించిన  సీసీటీవీ దృశ్యాలను గుజరాత్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ , బెంగుళూరులోని ఫిల్మ్ ఫ్యాక్టర్ కు పంపినట్టుగా సీబఐ అధికారులు తెలిపారు. అంతేకాదు ఉమాశంకర్ రెడ్డి ఎలా పరుగెత్తుతాడో  కూడా కొందరు సాక్షుల సమక్షంలో వీడియోలను రికార్డు చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్టుగా సీబీఐ తెలిపింది.

వివేకానందరెడ్డి హత్యకు ముందు నుండి నిందితులు పక్కా పథకం ప్రకారంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. హత్యకు 10 రోజుల ముందే వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో ఉండే కుక్కను నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డిలు కారుతో ఢీకొట్టి చంపారని సీబీఐ తెలిపింది.

హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలు గోడ దూకి వెళ్లిపోయారని రంగన్న సీబీఐ అధికారులకు వాంగ్మూలమిచ్చారు. ఎర్ర గంగిరెడ్డి మాత్రం తనను బెదిరించారని రంగన్న సీబీఐ అధికారులకు తెలిపారు.  2019 మార్చి 15న గంగిరెడ్డి ఇంట్లో నిందితులంతా సమావేశమయ్యారని సీబీఐ అధికారులు తెలిపారు.  పోలీసుల గురించచి తాను చూసుకొంటానని ఎర్ర గంగిరెడ్డి నిందితులకు హామీ ఇచ్చారని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

సీబీఐ అధికారుల దర్యాప్తునకు తమ క్లైయింట్ సహకరిస్తారని ఉమాశంకర్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సునీల్ యాదవ్ తో కలిసి ఉమా శంకర్ రెడ్డి ఈ హత్య కేసులో కీలకంగా వ్యవహరించారని సీబీఐ వాదించింది. ఈ దశలో బెయిల్ ఇవ్వవద్దని కోరింది. నిందితుడి బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని అభ్యర్ధించింది. 

ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు నిందతుడు ఉమాశంకర్ రెడ్డికి ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది.నిందితుడి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.


 

click me!