వైఎస్ వివేకా హత్య కేసు.. పులివెందులలోని వైసీపీ కార్యాలయానికి సీబీఐ అధికారులు.. భాస్కర్ రెడ్డి గురించి ఆరా..!

By Sumanth KanukulaFirst Published Jan 23, 2023, 5:39 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఈరోజు కడప నుంచి పులివెందులకు వెళ్లారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఈరోజు కడప నుంచి పులివెందులకు వెళ్లారు. పులివెందులలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు. పులివెందులలోని వైసీపీ కార్యాలయానికి వెళ్లిన అధికారులు భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీయగా.. ఆయన కార్యాలయానికి రాలేదని సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు. ఇక, వైసీపీ కార్యాలయం సమీపంలోనే ఉన్న వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఇంటి పరిసరాలను సీబీఐ అధికారులు పరిశీలించినట్టుగా తెలుస్తోంది. 

ఇక, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా తెలిపింది. చార్జిషీట్‌ సమర్పించిన తర్వాత మెరిట్‌పై డిఫాల్ట్‌ బెయిల్‌ను రద్దు చేయడంలో ఎలాంటి అడ్డంకి లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. సీబీఐ చేసిన పిటిషన్‌ను మెరిట్‌తో పరిశీలించాలని తెలంగాణ హైకోర్టును కోరింది. ఇక, ఇప్పటికే వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

click me!