వైఎస్ వివేకా హత్య కేసు: నిజానిజాలు త్వరలోనే బయటపడే అవకాశం.. దస్తగిరి కీలక కామెంట్స్

By Sumanth KanukulaFirst Published Feb 5, 2023, 2:14 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడపలో ఈరోజు సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కడపలో ఈరోజు సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన దస్తగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై బెదిరింపులు ఏమైనా జరుగుతున్నాయా? అని సీబీఐ అధికారులు అడిగినట్టుగా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తాను చెప్పాల్సిందంతా సీబీఐ అధికారులకు ఇప్పటికే చెప్పానని తెలిపారు. తన ఇబ్బందులను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్పారు. ప్రతి ప్రశ్నకు సమాధానం దొరికే సమయం తొందర్లోనే ఉందని అన్నారు. 

ఈ రోజు 10 తేదీ హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరవుతానని.. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నానని తెలిపారు. ఆధారాలు లేనిది ఎవరిని విచారణ చేయరని అన్నారు. నిజానిజాలు ఏమిటనేది త్వరలోనే బయటపడే అవకాశం ఉందన్నారు. ఈ కేసు విచారణ హైదరాబాద్‌కు బదిలీ కావడం మంచిదేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విచారణ జరగాలని సీఎం జగన్ తలచుకుంటే.. 10 రోజుల్లో కేసు పూర్తి అయ్యేదన్నారు.

ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు వేగం పెంచారు. ఈ కేసకు సంబంధించి వైసీపీ ఎంపీని సీబీఐ అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం సీఎం జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన ఇంట్లో  సహాయకుడిగా పనిచేస్తున్న నవీన్‌లను సీబీఐ అధికారులు కడపలోని సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌస్‌లో విచారించారు. ఆరు గంటలకు పైగా సీబీఐ అధికారులు వారిని విచారించారు. 

ఇక, వైఎస్‌ అవినాష్‌రెడ్డి కాల్‌ డేటా విశ్లేషణ ఆధారంగా కృష్ణమోహన్‌రెడ్డితో పాటు నవీన్‌కు కూడా తమ ముందు విచారణకు హాజరుకావాలని సీబీఐ ఇటీవల నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసుకు సబంధించి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు.. నిందితులందరికీ సమన్లు జారీ చేసింది. ఈనెల 10వ తేదీన హాజరుకావాలని ఆదేశించింది.

click me!