వైఎస్ వివేకా హత్య: ఆయుధాలను స్వాధీనం చేసుకొన్న సీబీఐ

By narsimha lodeFirst Published Aug 11, 2021, 5:07 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కు ఉపయోగించిన ఆయుధాలను సీబీఐ అధికారులు బుధవారం నాడు స్వాధీనం చేసుకొన్నారు.  ఈ ఆయుధాల కోసం సీబీఐ అధికారులు  వారం రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు.  సీబీఐ అధికారులు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్ల నుండే ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు.


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఉపయోగించిన   ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. అనుమానితుల ఇళ్లలోనే ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు.ఏకకాలంలో పలుగురు అనుమానితుల ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో  ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ను  గోవాలో సీబీఐ అధికారులు ఇటీవలనే అరెస్ట్ చేశారు. గోవా నుండి అతడిని కడపకు తీసుకొచ్చారు. సునీల్ యాదవ్ సీబీఐ విచారణలో చెప్పిన సమాచారం ఆధారంగా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తొలుత తనకు ఏమీ తెలియదని సునీల్ సీబీఐకి చెప్పారు.

also read:వివేకా హత్య కేసు: ఆ ఆయుధాలే టార్గెట్, సీబీఐ అదుపులో ఎర్రగంగిరెడ్డి.. ఉమా శంకర్ రెడ్డి ఇంట్లో సోదాలు

తమ కొడుకుకు వివేకా హత్యకు ఎలాంటి సంబంధం లేదని సునీల్ కుటుంబసభ్యులు కూడ చెప్పారు. సీబీఐ అధికారులు ఈ హత్య కేసును ఒప్పుకోవాలని  సునీల్ ను చిత్రహింసలు పెట్టారని వారు గతంలో ఆరోపించారు. వివేకాను ఎవరు హత్య చేశారో జగన్ కు తెలుసునని ఈ కేసులో సునీల్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకొంది. ఆయనను తీసుకొని మోట్నూతలపల్లెలో తనిఖీలు చేశారు. మరో అనుమానితుడు ఉమాశంకర్ రెడ్డి ఇంట్లో కూడ  సీబీఐ తనిఖీలు చేసింది.

ఈ కేసులో  కీలకమైన డాక్యుమెంట్లను కూడ సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బ్యాంకు పాస్ పుస్తకాలతో పాటు ఇతర డాక్యుమెంట్లను కూడ సీబీఐ సీజ్ చేసింది. సునీల్ యాదవ్ ఇంటితో పాటు గంగిరెడ్డి కీలకమైన డాక్యుమెంట్లను సీజ్ చేశారు.ఈ  విషయమై సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ స్టేట్‌మెంట్ ను కూడ సీబీఐ రికార్డు చేసింది.

 కడప జిల్లా పులివెందులలో గల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సిబిఐ అధికారులు మంగళవారం 12 మందిని విచారించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సిఐగా ఉన్న శంకరయ్యను, హోంగార్డు నాగభూషణంరెడ్డిని కూడా విచారించారు. శంకరయ్య హత్య జరిగిన చోట ఉన్నప్పుడే రక్తం మరకలను, ఇతర సాక్ష్యాధారాలను తుడిచేశారనే ఆరోపణలపై ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతా రెడ్డి సమర్పించిన అనుమానితుల జాబితాలో శంకరయ్య పేరు కూడా ఉంది. వివేకా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన ఇనాయతుల్లా, వివేకా పిఏ జగదీశ్వర్ రెడ్డి తమ్ముడు ఉమాశంకర్ రెడ్డి, చక్రాయపేట మండలానికి చెందిన వైసీపీ నాయకులు ఆదిరెడ్డి, అంజిరెడ్డిలను సిబిఐ అధికారులు విచారించారు. 

అంతే కాకుండా వేంపల్లే మండలానికి చెందిన చెన్నకేశవ, మల్లి, రహ్మతుల్లాఖాన్ లను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వాచ్ మన్ రంగయ్య జిల్లా మెజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చిన తర్వాత సిబిఐ అధికారులు వివేకా హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సునీల్ యాదన్ ను అరెస్టు చేశారు. 

click me!