వివేకా హత్య కేసు.. ఈరోజు మరోమారు సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాష్ రెడ్డి..

Published : Jun 18, 2023, 03:07 PM IST
వివేకా హత్య కేసు.. ఈరోజు మరోమారు సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాష్ రెడ్డి..

సారాంశం

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తుంది. ఈరోజు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  మరోసారి సీబీఐ కార్యాలయానికి వచ్చారు.

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగిస్తుంది. ఈరోజు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  మరోసారి సీబీఐ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టు విధించిన షరతుల మేరకు ప్రతి శనివారం విచారణకు  హాజరువుతున్నారు. గత మూడు శనివారాలుగా ఆయన సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే నేడు(ఆదివారం) అవినాష్ రెడ్డి  సీబీఐ కార్యాలయానికి రావడం చర్చనీయాశంగా మారింది. అయితే నిన్నటి విచారణ సందర్భంగా సీబీఐ కోరిన డాక్యుమెంట్స్ అందజేయడానికే అవినాష్ రెడ్డి ఈరోజు ఉదయం సీబీఐ కార్యాలయానికి వచ్చినట్టుగా  ప్రచారం సాగుతుంది. ఇక, ఉదయం 10:30 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాష్ రెడ్డి.. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

ఇదిలా ఉంటే, ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు పలుమార్లు అవినాష్ రెడ్డిని విచారించిన సంగతి తెలిసిందే. వివేకా హత్య జరిగిన స్థలంలో ఆధారాలను చెరిపివేయడంతో అవినాష్, ఆయన తండ్రి  భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే అవినాష్ విచారణకు సహకరించాలని.. జూన్ చివరి వరకు  ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డి ప్రతి శనివారం సీబీఐ అధికారులు ఎదుట విచారణకు హాజరవుతున్నారు. 

మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని సీబీఐ ఇటీవల ఏ8గా పేర్కొన్న సంగతి తెలిసిందే. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దని కౌంటర్‌ దాఖలు చేసిన సమయంలో.. ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఏ8 అని సీబీఐ పేర్కొంది. వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో అవినాష్‌, భాస్కర్‌రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ ఈ కౌంటర్‌లో తెలిపింది. వివేకా హత్య, ధ్వంసం వెనక భారీ కుట్రపై దర్యాప్తు సాగుతుందని పేర్కొంది. అవినాష్‌, భాస్కర్‌రెడ్డి‌లు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని తెలిపింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని  ప్రలోభపెట్టినట్టుగా కూడా పేర్కొంది. 

వివేకానందరెడ్డి హత్య విషయం ఆయన పీఏ కృష్ణారెడ్డి చెప్పకముందే అవినాష్ రెడ్డికి తెలుసునని సీబీఐ పేర్కొంది. . వివేకా హత్య విషయం సీఎం జగన్‌కు ఉదయం 6.15కి ముందే తెలుసని సీబీఐ తెలిపింది. శివశంకర్‌రెడ్డి ఫోన్‌ చేసిన నిమిషంలోనే అవినాష్‌రెడ్డి హత్యాస్థలికి చేరుకున్నారని తెలిపింది. హత్య జరిగిన రోజు ఉదయం 5.20కి ముందే అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డితో గంగిరెడ్డి మాట్లాడినట్టు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడని పేర్కొంది. దస్తగిరిని ప్రలోభ పెట్టేందుకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారని తెలిపింది.  కడప, పులివెందుల ప్రాంతాల్లో భాస్కర్‌రెడ్డి చాలా ప్రభావితం చేయగల వ్యక్తి అని పేర్కొంది. భాస్కర్‌రెడ్డికి బెయిల్‌ ఇచ్చి ఎన్ని షరతులు పెట్టినా నిరుపయోగమేనని తెలిపింది. దర్యాప్తునకు సహకరించానని భాస్కర్‌రెడ్డి చెప్పడం అబద్ధమని పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Constable Success Stories:వీళ్ళ ఎమోషనల్ మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు | Police | Asianet News Telugu
Bhumana Karunakar Reddy: దేవుడ్ని దోచి, ఒబెరాయ్ కు కట్టబెడుతున్న బాబు ప్రభుత్వం| Asianet News Telugu