వైఎస్ వివేకా హత్య కేసు: పులివెందుల వాగులో ఆయుధాల కోసం గాలింపు

By telugu teamFirst Published Aug 7, 2021, 1:03 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్టయిన సునీల్ యాదవ్ ను సిబిఐ అధికారులు పులివెందుల తీసుకుని వెళ్లి విచారిస్తున్నారు.

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్ ను పులివెందులకు తీసుకుని వెళ్లారు. అక్కడ ఆయనను విచారిస్తున్నారు. అదే సమయంలో పులివెందుల తూర్పు వైపున ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఉన్న వాగులో ఆయుధాల కోసం గాలింపు చేపట్టారు. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు వాడిన ఆయుధాల కోసం వాగులో గాలింపు చేపట్టారు. మున్సిపల్ అధికారులు, స్థానిక పోలీసుల సహకారంతో సిబిఐ అధికారుుల వాటి కోసం గాలింపు చేపట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి వాడిన ఆయుధాలను వాగులో నిందితులు వాగులో పడేసినట్లు సిబిఐ భావిస్తోంది. 

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు ఇటీవల సునీల్ యాదవ్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సునీల్ యాదవ్ ను అంతకు ముందు సిబిఐ అధికారులు విచారించారు. అయితే, ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. చివరకు గోవాలో అతను సిబిఐ అధికారులకు చిక్కాడు. 

వివేకా 2019 మార్చి 14వ తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసుపై ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టాయి. అయితే, హత్య ఘటనపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ వివేకా కూతురు సునీతా రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బిటెక్ రవి హైకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మేరకు సిబిఐ వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును చేపట్టింది.

click me!