
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిపై పోలీసు కేసు నమోదైంది. ఓ మైనర్ బాలుడిని ఇంట్లో బంధించి దాడికి పాల్పడినట్టుగా ఫిర్యాదు రావడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. పులివెందుల ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న జయమ్మ కాలనీలో దస్తగిరి నివాసం ఉంటున్నాడు. అయితే అతడు అదే వీధికి చెందిన కుళ్లాయమ్మ.. తన కుమారుడిని దస్తగిరి నిర్బంధించి, చిత్రహింసలు పెట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడిని కాపాడాలని కోరారు.
దీంతో పోలీసులు వెంటనే దస్తగిరి ఇంటికి వెళ్లి.. నిర్బంధించిన బాలుడిని విడిపించి పులివెందులలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దస్తగిరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, ఏపీలో అధికార వైసీపీకి చెందిన కార్యకర్తలు డిమాండ్ చేశారు.
ఆరు నెలల క్రితం దస్తగిరి వద్ద తన భర్తతో కలిసి వడ్డీకి రూ. 40 వేలు అప్పు తీసుకున్నట్లు కుళ్లాయమ్మ తెలిపింది. తాము ఆ డబ్బులకు వారం వారం వడ్డీ చెల్లిస్తున్నామని చెప్పింది. అయితే గత పది రోజుల నుంచి డబ్బులు సక్రమంగా కట్టకపోవడంతో తమ కుమారుడిని దస్తగిరి అతడి వెంట తీసుకెళ్లాడని.. ఇంట్లో నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశాడని తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడని కూడా చెప్పింది. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు..దస్తగిరిని కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అయితే ఈ ఆరోపణలను దస్తగిరి, ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు.
ఇక, వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసిన నిందితుల్లో దస్తగిరి కూడా ఉన్నాడు. అయితే తర్వాత ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారాడు.