వేరే రాష్ట్రంలో విచారణ చేయాలి: వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంలో సునీతా రెడ్డి పిటిషన్

By narsimha lode  |  First Published Aug 12, 2022, 9:27 AM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై సుప్రీంకోర్టులో వైఎస్ సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ  కేసు విచారణ జరగాలని ఆమె ఆ పిటిషన్ లో కోరారు.


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్ సునీతారెడ్డి.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని ఆ పిటిషన్ లో కోరింది. మరో వైపు ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తమిళనాడు లేదా కర్ణాటక రాష్ట్రంలో విచారణ నిర్వహించాలని ఆ పిటిషన్ లో కోరినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎబీఎన్ కథనాన్ని ప్రసారం చేసింది.

 ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదని వైఎస్ సునీతారెడ్డి అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ఈ విచారణ చేస్తున్న సీబీఐ అధికారులకు కూడా బెదిరింపులు చోటు చేసుకుంటున్నాయని కూడా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో సీబీఐ అధికారులకు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తికి కూడా బెదిరింపులు వచ్చిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేస్తున్నారని ఈ కథనం తెలిపింది. మరో వైపు సీబీఐ అధికారులపై కూడా రాష్ట్రంలో కేసులు నమోదౌతున్న విషయాలను కూడా ప్రస్తావించారు. హైకోర్టు పర్యవేక్షణలో  ఈ విచారణ సాగుతున్న సమయంలలో ఎలాంటి పురోగతి  లేదన్నారు. ఈ కారణంగానే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ సాగించాలని ఆమె కోరుతున్నారు.

Latest Videos

ఈ కేసు విచారణకు సంబంధించి కొన్ని కీలక విషయాలను కూడా ఆమె ప్రస్తావించారు. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న విషయాన్ని కూడ ప్రస్తావించారు. 

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డిని అతని ఇంట్లోనే దుండుగులు హత్య చేశారు. ఈ హత్య విషయమై అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఓటమి పాలైంది. జగన్ నాయకత్వంలోని వైసీపీ సర్కార్ ఏర్పాటైంది. జగన్ సర్కార్ కూడా ఈ హత్య కేసు విషయమై సిట్ ను ఏర్పాటు చేసింది.  అయితే ఈ హత్య కేసు విషయమై సిట్ దర్యాప్తు బృందం  విచారణపై అసంతృప్తితో సీబీఐ విచారణ చేయాలని కోరుతూ వైఎస్ సునీతారెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీంతో ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.ఈ హత్య కేసు విషయమై టీడీపీ నేత బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు కూడా సీబీఐ విచారణ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవిలపై వైసీపీ నేతలు అప్పట్లో ఆరోపణలు చేశారు. ఈ విషయమై ఎలాంటి విచారణలకైనా సిద్దమేనని వారు ప్రకటించారు. ఈ కేసు విచారణను సీబీఐ తో చేయిస్తే అసలు వాస్తవాలు తేలుతాయనే  ఉద్దేశ్యంతో తాము హైకోర్టులో సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టుగా చెప్పారు.

also read:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు హైకోర్టులో చుక్కెదురు.. ముగ్గురి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఈ కేసులో ఇప్పటికే కొందరిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయమై వైఎస్ వివేకానందరెడ్డి వద్ద గతంలో డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారారు. దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్  ఆధారంగా విచారణ నిర్వహించిన సీబీఐ అధికారులు  అరెస్టులు చేశారు .ఎర్ర గంగిరెడ్డి  , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

 వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని చెప్పారు.
 

click me!