కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్: సుప్రీంలో వైఎస్ సునీతా రెడ్డి సవాల్

By narsimha lodeFirst Published Jun 7, 2023, 9:34 AM IST
Highlights

కడప  ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు  బెయిల్ పై  వైఎస్ సునీతా రెడ్డి  సుప్రీం కోర్టులో   పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు  విచారణ  చేసే  అవకాశం ఉంది.  

న్యూఢిల్లీ: కడప ఎంపీ  వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై  తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన  తీర్పును వైఎస్  సునీతారెడ్డి సవాల్  చేశారు.     సునీతారెడ్డి దాఖలు  చేసిన  పిటిషన్ పై  బుధవారంనాడు  విచారణ  జరిగే అవకాశం ఉంది. కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి  తెలంగాణ  హైకోర్టు ఈ ఏడాది మే  31వ తేదీన  షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను  సుప్రీంకోర్టులో వైఎస్ సునీతారెడ్డి సవాల్  చేశారు.   

ముందస్తు బెయిల్  పిటిషన్ పై  విచారణ జరిపేలా  తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించాలని సుప్రీంకోర్టులో  వైఎస్ అవినాష్ రెడ్డి  ఈ ఏడాది  మే  22న   పిటిషన్ దాఖలు  చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు   ముందస్తు బెయిల్ పై విచారణ నిర్వహించాలని  తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆదేశించింది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు   తెలంగాణ హైకోర్టు  ఈ విషయమై  విచారణ నిర్వహించింది.  అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత   కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తూ  మే  31న  ఆదేశాలు  జారీ  చేసింది.

also read:కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

ఈ ఆదేశాలపై  సుప్రీంకోర్టులో  వైఎస్ సునీతారెడ్డి  పిటిషన్ దాఖలు  చేసింది. ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టులో  ఇవాళ  విచారణ  నిర్వహించింది.2019  మార్చి  14న  కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యాడు.  ఈ హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పై  సీబీఐ పలు  ఆరోపణలు  చేస్తుంది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు అప్పట్లో  చంద్రబాబు సర్కార్  సిట్ ఏర్పాటు  చేసింది.  ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన  వైఎస్ జగన్ ప్రభుత్వం  మరో సిట్  ను  ఏర్పాటు  చేసింది.  అయితే  ఈ కేసును సీబీఐతో విచారణ నిర్వహించాలని  ఏపీ హైకోర్టులో  పలువురు  పిటిషన్లు దాఖలు  చేశారు. ఈ పిటిషన్లపై  విచారణ  నిర్వహించిన ఏపీ హైకోర్టు సీబీఐ  విచారణకు  ఆదేశాల  జారీ  చేసింది.  దీంతో  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తుంది. ఈ నెల  30వ తేదీ లోపుగా  ఈ కేసు విచారణను పూర్తి  చేయాలని  సుప్రీంకోర్టు  ఇప్పటికే  సీబీఐని  ఆదేశించిన విషయం తెలిసిందే.

click me!