టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్: జగన్ జోరు, వైసీపీ రికార్డు

By telugu teamFirst Published Sep 26, 2021, 9:43 AM IST
Highlights

జిల్లా పరిషత్తు చైర్ పర్సన్స్ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ గల్లంతైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అన్ని జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ పదవులను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.

అమరావతి: జిల్లా పరిషత్తు చైర్ పర్సన్స్ ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. టీడీపీ పూర్తిగా గల్లంతైంది. వైఎస్ జగన్ జోరు కొనసాగింది. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ల పదవులను కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఒక పార్టీ అన్ని జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ల పదవులను దక్కించుకోలేదు. మొత్తం చైర్ పర్సన్ల పదవులను కైవసం చేసుకోవడం ద్వారా వైసీపి రికార్డు సృష్టించింది. 

వైసీపీకి చెందినవారే 13 జిల్లాల్లోనూ చైర్ పర్సన్ పదవులను దక్కించుకున్నారు. గుంటూరు జడ్పీ చైర్ పర్సన్ గా కత్తెర హెని క్రిస్టినా దక్కించుకున్నారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా ఉప్పాళ్ల హారిక ఎన్ికయ్యారు. మిగతా జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ పదవులను కూడా అధికారిక వైసీపీ శనివారం జరిగిన ఎన్నికల్లో సొంతం చేసుకుంది. 

అనంతపురం జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ గా బి. గిరిజమ్మ, చిత్తూరు జిల్లా చైర్ పర్సన్ గా గోవిందప్ప, తూర్పు గోదావరి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ గా వి. వేణుగోపాల రావు, పశ్చిమ గోదావరి జిల్లా చైర్ పర్సన్ గా కె. శ్రీనివాస్ ఎన్నికయ్యారు. 

కర్నూలు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా వెంకట సుబ్బారెడ్డి, నెల్లూరు జడ్పీ చైర్ పర్సన్ గా ఎ. అరుణమ్మ, ప్రకాశం జిల్లా చైర్ పర్సన్ గా బి. విజయమ్మ ఎన్నికయ్యారు. కడప జడ్పీ చైర్ పర్సన్ గా ఎ. అమర్నాథ్ రెడ్డి, విశాఖపట్నం జడ్పీ చైర్ పర్సన్ గా జె. సుభద్ర, విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఎం. శ్రీనివాస్ రావు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పి. విజయ ఎన్నికయ్యారు. 

ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు అఖండ విజయం సాధించింది. ఎన్నికల బహిష్కరణకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్పినప్పటికీ పలు చోట్ల అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ప్రచారం కూడా తీవ్రంగానే చేశారు. కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 

బిజెపికి, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు నామమాత్రంగానే సీట్లు వచ్చాయి. ప్రతిపక్షాలు జగన్ నాయకత్వంలోని వైసీపీకి సమీప దూరంలో కూడా లేవు. వైసీపీకి పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేకుండా పోయాయి. 

click me!