
ఫిరాయింపు ఎంఎల్ఏల అంశాన్ని జగన్ జాతీయ స్ధాయికి తీసుకెళుతున్నారు. ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో స్వయంగా కలగ జేసుకుని అనర్హులను చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు విజ్ఞప్తి చేసారు. వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన ఎంఎల్ఏలపై జగన్ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసారు. ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రివర్గంలో చోటు కల్పించటం పట్ల తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అనర్హత వేటు విషయంలో తమ ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. తమ ఫిర్యాదుపై స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు లేదు కాబట్టి స్వయంగా విచారించి వారిపై అనర్హత వేటు వేయాలని గవర్నర్ను కోరినట్లు జగన్ పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షం పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించటం మంచిది కాదని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేది లేదన్నారు. రాష్ట్రపతి సమయం ఇవ్వగానే ఢిల్లీ వెళ్లి కలుస్తామన్నారు. అలాగే, భారత ఎన్నికల ప్రధాన కమీషనర్ ను కూడా కలవనున్నట్లు చెప్పారు. జాతీయ స్ధాయిలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు అవకాశం ఇస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడిని కూడా కలిసి పరిస్ధితి వివరిస్తామని జగన్ చెప్పారు.