
అమరావతి: అవిశ్వాస తీర్మానంపై లోకసభలో జరుగుతున్న చర్చను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. లోకసభలోని పరిణామాలపై ఆయన రేపు శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు స్పందించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ వైఎస్ జగన్ ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు.
ఇదిలావుంటే, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చంద్రబాబు తమకు మిత్రుడేనంటూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు స్పందిస్తున్నారు. బిజెపితో చంద్రబాబు నెయ్యానికి సంబంధించిన గుట్టు రట్టయిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజ్‌నాథ్ ప్రకటనపై టీడీపీ ఎంపీలు కనీసం నిరసన కూడా తెలపలేదని వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు రాజ్‌నాథ్ చేసిన ప్రకటననను వింటూ కుర్చున్నారని ఆయన అన్నారు. గతంలో టీడీపీ-బీజేపీ బంధంపై మేం చెప్పిందే నిజమైందని వైఎస్సార్‌సీపీ నేత అన్నారు.
బీజేపీతో బంధం కొనసాగుతోంది కాబట్టే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లలేదని, అవిశ్వాసంపై లోపాయికారిగా ముందే మాట్లాడుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిధులపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతుండగా టీడీపీ ఎంపీలు స్పందించలేదని, దీన్ని బట్టి చూస్తే ఎన్‌డీఏతో తెగదెంపులనేది టీడీపీ ఆడిన డ్రామా తెలిసిపోతోందని ఆయన అన్నారు.