తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు: సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Jan 30, 2023, 12:49 PM IST
Highlights

రాష్ట్రంలో కులాల మధ్య యుద్దం జరగడం లేదని.. పేదవాడు ఒకవైపు ఉంటే పెత్తందారులు మరోవైపు ఉండి యుద్దం జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. తనుకు ఎలాంటి పొత్తులు లేవని.. సింహంలా తాను ఒక్కడినే నడుస్తానని చెప్పారు. 

రాష్ట్రంలో కులాల మధ్య యుద్దం జరగడం లేదని.. పేదవాడు ఒకవైపు ఉంటే పెత్తందారులు మరోవైపు ఉండి యుద్దం జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. తనుకు ఎలాంటి పొత్తులు లేవని.. సింహంలా తాను ఒక్కడినే నడుస్తానని చెప్పారు. జగనన్న చేదోడు పథకంలో భాగంగా మూడో విడత సాయం నిధుల విడుదల కార్యక్రమం కోసం సీఎం జగన్ నేడు పల్నాడు జిల్లా  వినుకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సీఎం జగన్ మాట్లాడుతూ.. నవరత్నాలు ద్వారా పేదవారికి సంక్షేమ  పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి మేలు జరుగుతోందని అన్నారు. ఎక్కడ కూడా వివక్ష, అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని  చెప్పారు. గత ప్రభుత్వాలు బలహీనవర్గాలను పట్టించుకోలేదని  విమర్శించారు. 

జగనన్న  చేదోడు ద్వారా దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు సాయం అందిస్తున్నట్టుగా చెప్పారు. దేశానికి ఆదర్శంగా తమ  ప్రభుత్వ పాలన సాగుతుందని తెలిపారు. మూడో విడతలో 3,30,145 మందికి రూ. 330.15 కోట్ల లబ్ది  చేకూరుతుందని చెప్పారు. మూడేళ్లలో జగనన్న చేదోడు కింద రూ. 927.51 కోట్లు అందజేశామని తెలిపారు. దేశంలోని జీఎస్‌డీపీలో ఏపీ  నెంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు. 11.43 శాతం గ్రోత్ రేట్‌తో దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. జగన్ అంటే నచ్చని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అవుతుందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరి వాళ్ల ప్రభుత్వంలో జరగని విధంగా దేశానికే దిక్సూచిగా 11.43 శాతం గ్రోత్ రేట్‌తో పరుగెడుతున్నామని చెప్పారు. 

రాష్ట్రంలో 70 శాతం మంది రైతులు ఒక హెక్టార్‌ లోపు ఉన్నవారేనని అన్నారు. రైతు భరోసా ద్వారా 80 శాతం పంటలకు 80 శాతం ఖర్చు అందుతోందని చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను అందిస్తున్నామని తెలిపారు. రైతులు నష్టపోతే అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. కోటి మంది రైతులకు వెన్నుదన్నుగా ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలను మోసం చేసిందని విమర్శించారు. వైఎస్సార్ ఆసరా, సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలను ఆదుకున్నామని చెప్పారు. 

గతంలో పాలకులని చూశామని.. ముఖ్యమంత్రి స్థానంలో ఒక ముసలాయనను చూశామని అన్నారు. గతంలో కూడా ఇదే రాష్ట్రమని.. అప్పటికన్నా ఇప్పుడు చేస్తున్న అప్పులు తక్కువే అని అన్నారు. గతంలో ఎందుకు బటన్‌లు లేవు.. ఎందుకు అక్కాచెల్లమ్మల ఖాతాల్లోకి వేల కోట్ల రూపాయలు రాలేదో ఆలోచన చేయాలని కోరారు. జగన్ పాలనలో బటన్‌లు మాత్రమే ఉన్నాయని.. ఎక్కడ వివక్ష లేదని, లంచాలు లేవని అన్నారు. బటన్ నొక్కడంతోనే నేరుగా అక్కాచెల్లమ్మల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయని చెప్పారు. 

గతంలో ముసలాయన ప్రభుత్వంలో గజదొంగల ముఠా ఉండేదన్నారు. గజదొంగలకు దుష్టచతుష్టయం అని పేరు కూడా ఉండేదని విమర్శించారు. గజదొంగల ముఠా అంతా రాష్ట్రాన్ని దోచేశారని విమర్శించారు. అప్పట్లో డీపీటీ.. దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్టుగా దుష్టచతుష్టయం వ్యవహరించిందని ఆరోపించారు. వాళ్లకు అనుకూలంగా ఉన్న పేపర్లు రాయవని అన్నారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు  ప్రశ్నించడని విమర్శించారు. ఇలాంటి పరిపాలన  కావాలా.. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా బటన్‌ నొక్కే జగన్ పాలన కావాలా అని ఆలోచన చేయాలని కోరారు. 

రాష్ట్రంలో కులాల మధ్య యుద్దం జరగడం లేదని.. పేదవాడు ఒకవైపు ఉంటే పెత్తందారులు మరోవైపు ఉండి యుద్దం జరుగుతుందని అన్నారు. మాట మీద నిలబడే జగన్‌కు.. వెన్నుపోటు, మోసం మరోవైపు ఉండి యుద్దం జరుగుతుందన్నారు. ‘‘నాకు ఎలాంటి పొత్తులు లేవు.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు’’ అని అన్నారు. తోడేళ్లందరూ ఒక్కటవుతున్నారు.. కానీ తనకు భయం లేదని అన్నారు. తాను ప్రజల, దేవుడిని మాత్రమే నమ్ముకున్నానని అన్నారు. తనకు దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు తప్ప ఏమి లేవని  అన్నారు. ఇంకా మంచిచేసే రోజులు రావాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. 

click me!