పిఠాపురానికి వంగా గీత.. కాకినాడ నుంచి పోటీకి ససేమిరా అంటోన్న నేతలు , మరి వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఎవరు ..?

By Siva KodatiFirst Published Dec 24, 2023, 6:35 PM IST
Highlights

ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, సొంత సర్వేలు, ఇతరత్రా సమాచారం ఆధారంగా గెలవరు అనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు జగన్ . సిట్టింగ్ ఎంపీ వంగా గీతను పిఠాపురం నియోజవర్గానికి మార్చాలని జగన్ నిర్ణయించిన నేపథ్యంలో కాకినాడ లోక్‌సభ వైసీపీ అభ్యర్ధి ఎవరు అనే చర్చ మొదలైంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని అందుకోవాలని చూస్తోన్న సీఎం వైఎస్ జగన్ మార్పు, చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, సొంత సర్వేలు, ఇతరత్రా సమాచారం ఆధారంగా గెలవరు అనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు. ఆప్తులైనా, సన్నిహితులైనా, బంధువులైనా సరే నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు జగన్. అధినేత తమ టికెట్ వుంచుతారో, చించేస్తారోనని నేతలు టెన్షన్ పడుతున్నారు. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే చాలు వణికిపోతున్నారు. కొందరికి టికెట్లు నో చెబుతుంటే.. ఇంకొందరిని మాత్రం మరో చోటికి పంపుతున్నారు జగన్. అలవాటైన నియోజకవర్గాన్ని వదులుకోవడానికి నేతలు ససేమిరా అంటున్నారు. 

ఈ ప్రాసెస్‌లో జగన్‌కు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. కాకినాడ ఎంపీ సీటుకు సరైన అభ్యర్ధి కరువయ్యారు. సిట్టింగ్ ఎంపీ వంగా గీతను పిఠాపురం నియోజవర్గానికి మార్చాలని జగన్ నిర్ణయించిన నేపథ్యంలో కాకినాడ లోక్‌సభ వైసీపీ అభ్యర్ధి ఎవరు అనే చర్చ మొదలైంది. ఈ స్థానంలో టీడీపీ కూడా బలంగా వుండటంతో కొత్త నేతలు బరిలోకి దిగేందుకు సాహసం చేయలేకపోతున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది. 

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురంలలో ఎమ్మెల్యేలను మార్చాలనే యోచన పరిస్ధితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. ఈ నియోజకవర్గాల్లో కొత్త నేతలను దించాలని హైకమాండ్ భావిస్తోంది. పెండెం దొరబాబు  స్థానంలో వంగా గీతకు టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా కేడర్ నుంచి రెస్పాన్స్ అంతంత మాత్రమే. తొలుత 2014లో కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్‌ను గీతకు బదులుగా టికెట్ కేటాయించాలని వైసీపీ పెద్దలు భావించారు. అయితే తనకు వరుస ఓటములు ఎదురవుతున్న నేపథ్యంలో కాకినాడ నుంచి పోటీకి సునీల్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. 

ఇక మాజీ మంత్రి కురసాల కన్నబాబును అభ్యర్ధిగా అనుకున్నప్పటికీ ఆయన కూడా విముఖత వ్యక్తం చేశారు. దీంతో కాకినాడ స్థానంలో ఎంపీగా ఎవరిని బరిలోకి దించాలా అని వైసీపీ డైలామాను ఎదుర్కొంటోంది. మరి ఈ సమస్యను జగన్ ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి. 

click me!