
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ల భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ భేటీపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా .. జగన్‌ను పీకేదెం ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని.. తాము రోజూ చెబుతూనే వున్నామని కొడాలి నాని దుయ్యబట్టారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ను చంద్రబాబు కలిస్తే భూమి బద్ధలైపోతుందా.. తాము పీకేను పూర్తిగా వాడేశామని, ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయిందని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
వైసీపీకి వ్యూహకర్తగా వున్నప్పుడు బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏం పీకుతాడని చంద్రబాబు అన్నారని.. మరిప్పుడు ఏం పీకడానికి పీకేతో భేటీ అయ్యారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతోనే వివేకాను చంపి, కోడికత్తి డ్రామాలు ఆడారని ఎల్లో మీడియా అప్పట్లో గగ్గోలు పెట్టిందని.. మరిప్పుడు చంద్రబాబు పీక కోయించుకుంటారా అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. లేదా లోకేష్‌ను తండ్రిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంత్ కిషోర్‌కు ఐప్యాక్‌కు సంబంధం లేదని.. ఇండియా కూటమిలో చేరాల్సిందిగా మమతా బెనర్జీ పంపితేనే ఆయన ఉండవల్లి వెళ్లారని నాని అన్నారు. ఓ పీకే బీజేపీతో చర్చలు జరుపుతుంటే.. మరో పీకే ఇండియా కూటమి, మమతా బెనర్జీ, కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని కొనసాగిస్తున్నారని కొడాలి నాని చురకలంటించారు.
ఇకపోతే.. టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశాంత్ కిశోర్ కలవడంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ శ్రేణులపై టీపీడీ అధినేత చంద్రబాబు నమ్మకం కోల్పోయారనీ, అందుకే ప్రశాంత్ కిషోర్ ను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ జనం గుండెల్లో ఉన్నారని, ఎవరు వచ్చినా.. ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఏపీలో మరోసారి వైసీపీనే గెలుస్తుందనీ, జగన్ నే మరోసారి అధికార పగ్గాలు చేపడుతారని స్పష్టం చేశారు. నిజంగా చంద్రబాబుకి సిగ్గు,శరం,మానాభిమానాలు ఏవీ లేవని, ఆయన చర్యలు చూస్తేనే అర్థమవుతుందని అంబటి మండిపడ్డారు.
గతంలో ప్రశాంత్ కిశోర్ గురించి చంద్రబాబు, లోకేశ్ లు ఏం మాట్లాడారో గుర్తుకు చేసుకోవాలనీ, బీహారోడు ఇక్కడికొచ్చి ఏం పీకుతాడనీ, బీహారోడి ఆట కట్టు, తోలు తీస్తామని వ్యాఖ్యానించారని గుర్తుకు చేశారు. బీహారోడికి ఇక్కడేం పని అని, తమకు ఎవరి సలహాలు అక్కర్లేదనీ, తాము ప్రజలను నమ్ముకున్నామని గతంలో లోకేశ్ అన్నాడని గుర్తు చేశారు. మరి ఇవాళ ఎవడ్ని నమ్ముకున్నారు? మేం ఛీ కొడితే బయటికి వెళ్లినోడ్ని.. గతిలేక బతిమాలి తెచ్చుకున్నారనీ, పవన్ కల్యాణ్ పై నమ్మకం లేదనీ, పార్టీ కార్యకర్తలను నమ్ముకునే పరిస్థితి లేదని దీన్ని బట్టి అర్థమవుతోందని పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.