తండ్రినే ఫాలో అయ్యారు కానీ గొప్ప ట్విస్ట్ ఇచ్చారు: జగన్ ప్లాన్ పై చర్చ

By Nagaraju penumalaFirst Published Jun 8, 2019, 8:14 PM IST
Highlights

ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి కూడా వీరంతా సన్నిహితులే. వైయస్ మరణానంతరం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా మారిపోయారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవులను కొట్టేశారు. విధేయులకు పట్టం కట్టాలన్న తండ్రి మాటను నిలబెడుతూ పదవుల పంపకాల్లో మాత్రం ట్విస్ట్ ఇచ్చారు జగన్. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ కూర్పు చాలా వ్యూహాత్మకంగా చేశారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం  జరిగేలా కూర్పు జరిగిందని ఆ పార్టీ భావిస్తోంది. ఇకపోతే జగన్ తన కేబినెట్ లో 25 మందికి అవకాశం కల్పిస్తే వారిలో 5 మంది మాజీమంత్రులే. 

దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రులుగా పనిచేసిన వారే కావడం విశేషం. వారే బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, మోపిదేవి వెంకటరమణ. వీరంతా 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నవారే కావడం విశేషం. 

ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి కూడా వీరంతా సన్నిహితులే. వైయస్ మరణానంతరం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా మారిపోయారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవులను కొట్టేశారు. విధేయులకు పట్టం కట్టాలన్న తండ్రి మాటను నిలబెడుతూ పదవుల పంపకాల్లో మాత్రం ట్విస్ట్ ఇచ్చారు జగన్. 

వైయస్ రాజశేఖర్ రెడ్డికి బంధువులు, అత్యంత సన్నిహితులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు. ఈ నేతలిద్దరూ వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మెలుగొందారు. అందుకే వీరికి 2009 కేబినెట్ లో అవకాశం కల్పించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.

ఆ కేబినెట్ లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి భూగర్భ గనులు, చేనేత జౌళిశాఖలను కేటాయించారు. ఇకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అటవీశాఖ పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. 

అయితే వైయస్ జగన్ కూడా 2019 కేబినెట్ లో తండ్రిని ఫాలో అయ్యారు. తండ్రిలాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు జగన్ తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అయితే శాఖల కేటాయింపుల్లో మాత్రం ట్విస్ట్ ఇచ్చారు. 

వైయస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో ఆనాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఏ శాఖలు అయితే కట్టబెట్టారో అవే శాఖలను జగన్ తన కేబినెట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేటాయించారు. ఇకపోతే ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి తన కేబినెట్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏ శాఖలు అయితే కేటాయించారో అవేశాఖలను బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కేటాయించారు జగన్. 

ఈ వార్తలు కూడా చదవండి

తండ్రి కంటే ఒక అడుగు ముందుకేసిన సీఎం వైయస్ జగన్ : చారిత్రాత్మక నిర్ణయం ఇదే....

click me!