నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సీఎస్ కౌంటర్: ప్రవీణ్ ప్రకాశ్ బదిలీకి నో

By telugu teamFirst Published Feb 1, 2021, 8:58 AM IST
Highlights

సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేయాలనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచనను సీఎస్ ఆదిత్యనాథ్ తిరస్కరించారు. ఐఎఎస్ మీద నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదని ఆయన స్పష్టం చేశారు.

అమరావతి: సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయం) ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇష్టపడలేదు. ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేయాలనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచనను ప్రభుత్వం తిరస్కరించింది. 

అఖిల భారత సర్వీస్ (ఐఎఎస్) అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం ఎస్ఈసీకి లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాశ్ మీద చేసిన ఆరోపణలు నిరాధారమని ఆయన స్పష్టం చేసారు. అయితే, ప్రవీణ్ ప్రకాశ్ మీద చర్యలు తీసుకోవాలనే అంశాన్ని పున:పరిశీలించాలని ఆదిత్యనాథ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరారు.

అధికారులతో తన వీడియో కాన్ఫరెన్స్ ను ప్రవీణ్ ప్రకాశ్ అడ్డుకున్నారని ఆరోపిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను, ఎన్నికల అధికారులను సంప్రదించకుండా ప్రవీణ్ ప్రకాశ్ ను ఆదేశించాలని కూడా ఆయన సూచించారు. ప్రవీణ్ ప్రకాశ్ మీద ఇతర ఆరోపణలు కూడా ఆయన చేశారు. ఆ కారణాల వల్ల ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేయాలని ఆయన సూచించారు. 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ఆరోపణలపై ప్రవీణ్ ప్రకాశ్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు వివరణ ఇచ్చారు. సీఎస్ తనపై ఏ విధమైన చర్యలు తీసుకున్నా తాను సమ్మతిస్తానని ఆయన తన వివరణలో చెప్పారు. అయితే, ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేయాలనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచనను ఆయన తిరస్కరించారు. 

click me!