నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఐపీఎస్ అధికారికి జగన్ ప్రభుత్వం కీలక పోస్టు

By telugu teamFirst Published Feb 9, 2021, 9:09 AM IST
Highlights

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహానికి గురైన ఐపీఎస్ అధికారి అవుల రమేష్ రెడ్డికి వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక పోస్టును కట్టబెట్టింది. కొంత కాలం నిరీక్షించిన తర్వాత ఆయనకు ఆ పోస్టు లభించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి, జగన్ సర్కారుకు మధ్య కొనసాగుతున్న పోరులో మరో పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల వేళ నిబంధనలకు విరుద్ధంగా అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొని, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆగ్రహానికి గురై, బదిలీ అయిన అధికారులకు ప్రభుత్వం కీలక పోస్టులు కట్టబెడుతోంది.

కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. తొలి వారంలోనే ఇద్దరు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారి సహా డజనుమంది ఉద్యోగులపై చర్యలకు ఆదేశించడం, విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని మార్చేయడం తెలిసిందే. అలా బదిలీ అయినవారిలో నారాయణ్ భరత్ గుప్తా(చిత్తూరు మాజీ కలెక్టర్)ను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా, గుంటూరు మాజీ కలెక్టర్ ఐ శామ్యుల్ ఆనంద్ కుమార్‌ను రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించడం తెలిసిందే. అదే సమయంలో బదిలీ అయిన ఐపీఎస్ అధికారి రమేశ్ రెడ్డికి మాత్రం ఆలస్యంగానైనా కీలక పోస్టే దక్కింది.

తిరుపతి అర్బన్ ఎస్పీగా పనిచేసిన ఆవుల రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరడంతో ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది. రమేశ్ స్థానంలో తిరుపతి అర్బన్ ఎస్పీగా సీహెచ్ వెంకటప్పలనాయుడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రెండు వారాలుగా వెయిటింగ్ లిస్టులో ఉన్న రమేశ్ రెడ్డిని ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలోకి తీసుకుంటున్నట్లు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి

నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైనప్పటికీ ఉద్యోగులు ఆందోళన చెందవద్దంటూ పలువురు మంత్రులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తుండటం, పంచాయితీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి అయితే మరో అడుగు ముందుకేసి, ఎస్ఈసీ ఆదేశాలను అధికారులు పాటించాల్సిన అవసరం లేదనే అర్థంలో మాట్లాడటం, వాటిపై ఎస్ఈసీ చర్యలకు దిగడం తెలిసిందే. నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన అధికారులకు కీలక పోస్టులు ఇవ్వడం ద్వారా మిగతా వారికీ భరోసా కల్పించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

click me!