
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు నీటి కష్టాలు తీరనున్నాయి. ఆత్మకూరు స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఎయిమ్స్‌కు నీటిని సరఫరా చేసేందుకు జగన్ ప్రభుత్వం గురువారం అనుమతినిచ్చింది. అయితే ఇందుకయ్యే ఖర్చుతో పాటు ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఎయిమ్స్ చెల్లించాలని ఆదేశించింది. అలాగే కరువు సమయంలో నీరు సరఫరా చేయడం లేదని ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం షరతులు పెట్టింది.
ఇకపోతే.. ఈ ఏడాది జూన్‌లో కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ ఎయిమ్స్‌ను సందర్శించి అక్కడి సదుపాయాలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓపీ సేవలు సరిగ్గా లేవన్న ఫిర్యాదులపై భారతి ప్రవీణ్ ఫైరయ్యారు. ప్రతిరోజూ తానే వచ్చి గంట పాటు ఓపీ చూడాలా అంటూ ప్రశ్నించారు. ల్యాబ్ రిపోర్ట్‌లు ఎంత సేపటిలో అందిస్తున్నారని.. కేంద్ర మంత్రి ప్రశ్నించగా.. గంటలో అందిస్తున్నారని చెప్పారు. అయితే తనకున్న సమాచారం ప్రకారం రిపోర్ట్‌లు ఇవ్వడానికి ఒక రోజు తీసుకుంటున్నారని .. త్వరగా ఇవ్వాలని ఆమె ఆదేశించారు.
ALso REad:కోట్లాది నిధులిచ్చాం .. నిర్వహణ ఇలాగేనా, మంగళగిరిలోని ఎయిమ్స్ అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం
ఆసుపత్రిలో రక్షిత మంచినీటి సమస్య వుందని.. టెండర్లు రావడం లేదని అధికారులు మంత్రికి వివరించారు. అయితే ఇంత పెద్ద భవనాలు కట్టడానికి టెండర్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు రావడం లేదని ఆమె ఫైరయ్యారు . రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నీటి సమస్య తీసుకెళ్లారా అని ప్రశ్నించారు. సీఎం సమస్యను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారని చెప్పారు అధికారులు. ఎయిమ్స్‌లో ఖాళీలను భర్తీ చేయాలని అధికారులు కోరగా.. దీనిపై కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని భారతి ప్రశ్నించారు. కోట్ల రూపాయల నిధులు ఇచ్చినా ఆసుపత్రి నిర్వహణ ఇలా చేస్తారా అంటూ అధికారులపై మండిపడ్డారు. ప్రధాని మోడీ ఒక్కరే పనిచేస్తే సరిపోదని.. అందరూ పనిచేయాలని కోరారు భారతి ప్రవీణ్.