Fire accident in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం.. ఆరుగురు స‌జీవ ద‌హ‌నం

Published : Oct 08, 2025, 02:22 PM IST
Fire accident in AP

సారాంశం

Fire accident in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాల్లో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మ‌ర‌ణించ‌గా, ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. 

రాయవరంలో విషాద సంఘ‌ట‌న

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్క‌ర్ కోనసీమ జిల్లాలోని రాయవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లక్ష్మి గణపతి గ్రాండ్‌ పేరిట నడుస్తున్న బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం ఉదయం భారీ పేలుడు జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆరు మంది కార్మికులు అక్కడికక్కడే దహనమయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పేలుడు ధాటికి కూలిన గోడ

ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారని అధికారులు తెలిపారు. అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో ఫ్యాక్టరీ షెడ్డు గోడ కూలిపోయింది. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచార‌ణ ప్రారంభించారు. రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిస్థితిని పరిశీలించారు.

దర్యాప్తు ప్రారంభం

జిల్లా కలెక్టర్‌ మహేశ్‌కుమార్ ఈ విష‌య‌మై మాట్లాడుతూ.. వారం క్రితం ఈ బాణసంచా యూనిట్‌ను పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలించి భద్రతా ప్రమాణాలు సరిగా ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. అయితే ప్రమాద సమయంలో అగ్నిమాపక పరికరాలను సరిగ్గా వినియోగించారా లేదా అనే అంశంపై విచారణ కొనసాగుతోందన్నారు. ప్రమాదానికి గల క‌చ్చితమైన కారణాలు త్వరలో వెలుగులోకి వస్తాయని చెప్పారు.

సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, సహాయక చర్యలను వేగంగా నిర్వహించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌ని హామీ ఇచ్చారు.

మంత్రి అనిత హామీ

హోం మంత్రి అనిత కూడా ఈ ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా ఎస్పీ, అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయని తెలిపారు.

మంట‌లు అదుపులోకి..

మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, ప్రమాద స్థలం ఇంకా భయానకంగా ఉంది. శిథిలాల తొలగింపు, మృతదేహాల గుర్తింపు పనులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో రాయవరంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్