
పెద్ద నోట్ల రద్దుకు, చంద్రబాబుకు ప్రతిపక్ష నేత బాగానే ముడేసారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందుగా తెలియటం వల్లే ముఖ్యమంత్రి స్వాగతించారని ఆరోపించారు.. అయితే, ఆ తర్వాత ప్రజాగ్రహాన్ని గ్రహించటంతో చంద్రబాబు మళ్లీ ప్లేట్ మార్చేసినట్లు వ్యగ్యంగా ఎత్తిపొడిచారు. పెద్ద నోట్ల రద్దు వల్ల చంద్రబాబు లాంటి కొద్ది మంది తప్ప దేశవ్యాప్తంగా అందరూ నష్టపోతున్నారన్నారు. చంద్రబాబుకు ఎప్పుడూ ప్రచార యావ తప్ప ఇంకేమీ ఉండదన్నారు.
మంచి జరిగితే తన ప్రతిభ, చెడు ఎదురైతే ఎదుటివారిదన్నట్లు చంద్రబాబు వ్యవహరిస్తారని అన్నారు. అటువంటిది ఇక్కడ చెల్లదని కాబట్టి, నోట్ల రద్దు వాయిదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడిని ఒప్పించాల్సిన బాధ్యత చంద్రబాబు తీసుకోవాలని సూచించారు. నోట్ల రద్దు నిర్ణయం వెలువడగానే తాను రాసిన లేఖ వల్లే పెద్ద నోట్లు రద్దైనట్లు సిఎం చెప్పారన్నారు.
అయితే, ఆ తర్వాత జనాభిప్రాయాన్ని చూసిన తర్వాత అసలు ఆ విషయమే మాట్లాడటం లేదన్నారు. పైగా నోట్ల రద్దు సమస్య ఇంకా ఎంత కాలమని ప్రధానిపై తన అసహనాన్ని చంద్రబాబు ప్రకటించటం విడ్డూరమని ఎద్దేవా చేసారు.
చంద్రబాబుకు పనీ పాట లేదు కాబట్టే ప్రతీ రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట టివిల్లో కనబడుతున్నట్లు చెప్పారు. సత్యానాదెళ్ళను తానే ఐటి చదవమన్నానని, బిల్ క్లింటన్కు తానే సాఫ్ట్ వేర్ రంగంలోకి దిగమన్నానని, దేశంలోకి సెల్ ఫోన్లు తానే తెచ్చానని చెప్పుకోవటమే నిరద్శనమన్నారు. రోజుకు మూడు సార్లు టివిల్లో కనబడుతుండటంతో చంద్రబాబును చూడలేక ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
సిఎంకు నోట్ల రద్దు విషయం ముందుగా తెలుసుకాబట్టే తెలంగాణాలోని హెరిటేజ్ వ్యాపారాన్ని ఫ్యూచర్ గ్రూప్ కు అమ్మేసుకున్నట్లు ఆరోపించారు. కేంద్రంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేయటానికి ఆయన పార్టీ కండువా కప్పుకున్న వెంకయ్యనాయడున్నారు, ఆయనతో పాటు టిడిపికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులున్నట్లు చెప్పారు.