ఎవరితోనూ పొత్తులుండవు, ఎవరినీ నమ్మొద్దు: బాబును ఏకేసిన జగన్

First Published May 1, 2018, 6:16 PM IST
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తారు. 

మచిలీపట్నం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తారు. చంద్రబాబు మూడు వేల రూపాయలు ఇస్తానని వస్తారని, ఐదు వేల రూపాయలు అడగాలని, ఓటు మాత్రం మనస్సాక్షి ప్రకారం వేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన మంగళవారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే నాలుగు సంతకాలు పెట్టారని, అందులో బెల్టు షాపులు రద్దు చేస్తామనే ఫైలుపై మొదటి సంతకం చేశారని ఆయన గుర్తు చేస్తూ మంత్రి దగ్గరుండి బెల్టు షాపులను వేలం వేయిస్తున్నారని, ప్రజలతో తాగించి ఆదాయం పెంచుకుంటున్నారని ఆయన అన్నారు. 

వ్యవస్థలను కాపాడాల్సినవాళ్లే నాశనం చేస్తున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన స్థలాలను తిరిగి కబ్జా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపి నాయకులు టాయిలెట్లను, శ్మశానాలను కూడా కబ్జా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ బంధువులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థఇతి ఏమిటని ఆయన అడిగారు. 

బందరు ఓడరేవు కోసం రైతులకు చెప్పకుండా 33 వేల ఎకరాల భూస్వాధీనానికి చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, దానికి 4800 ఎకరాలే ఎక్కువని రైతులు ఆక్రోశంతో చెప్పారని, అయితే పోలీసులను ఉపయోగించి పశుబలంతో భూములు లాక్కున్నారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే కేవలం 4800 ఎకరాలు మాత్రమే తీసుకుంటామని చెప్పారు. 

రైతుల కోసం తాను రెండుసార్లు బందరు వచ్చానని, నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకోకపోవడంతో రైతులకు రుణాలు అందడం లేదని అన్నారు. పరిశ్రమలన్నింటిలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తాము చట్టం తెస్తామని చెప్పారు. గ్రామ సెక్రటేరియట్లు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. 

చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆయన అన్నారు. తెలంగాణకు వచ్చి తన వల్లనే తెలంగాణ వచ్చిందని చంద్రబాబు చెబుతారని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాష్ట్రాన్ని విడగొట్టి అన్యాయం చేసారని అంటారని ఆయన వ్యాఖ్యానించారు. హోదా ఇస్తామని చెప్పిన బిజెపి పని అయిపోయిన తర్వాత మోసం చేసిందని విమర్శించారు. వద్దంటే కాంగ్రెసు రాష్ట్రాన్ని విడగొట్టిందని, ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ కారణమని అన్నారు. అందువల్ల ఎవరనీ నమ్మవద్దని ఆయన అన్నారు. ఎవరితోనూ పొత్తు వద్దు, ఎవరినీ నమ్మవద్దని అన్నారు.

రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాల్లో తమ పార్టీని గెలిపించాలని, 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపిస్తే హోదా ఇస్తామని చెప్పి సంతకం చేసిన పార్టీకే మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమని చెప్పారు. హోదా ఇస్తే లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. 

click me!