అలా అయితే టీడీపికి ఎందుకు సహకరిస్తాం: పవన్ కల్యాణ్

First Published 1, May 2018, 4:42 PM IST
Highlights

 తమ పార్టీ ఓ ఒక్క కులానికో ప్రాతినిధ్యం వహించదని అంటూ కులం అనే భావన ఉంటే తెలుగుదేశం పార్టీకి ఎలా సహకరిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

హైదరాబాద్: తమ పార్టీ ఓ ఒక్క కులానికో ప్రాతినిధ్యం వహించదని అంటూ కులం అనే భావన ఉంటే తెలుగుదేశం పార్టీకి ఎలా సహకరిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కులాలకు అతీతంగా ఆలోచన చేద్దామని ఆయన అన్నారు. కుల, మత సామరస్యం కాపాడడం మన పార్టీకి ప్రొఫెషనల్స్ సహకారం అవసరం ఉందని అన్నారు. అందుకే దేవ్ ను ముఖ్య రాజకీయ వ్యూహకర్తగా తీసుకున్నామని చెప్పారు. 

ఎన్నికల సమయంలోనే కాకుండా ఎన్నికల తర్వాత కూడా దేవ్ సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. జనసేన కొద్ది స్థానాల్లోనే పోటీ చేస్తుందని ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. 175 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు.

గత ఎన్నికల్లో 70 నుంచి 80 అసెంబ్లీ స్థానాలకు, 8 పార్లమెంటు స్థానాలకు పోటీ చేయాలని అనుకున్నా తర్వాతి పరిస్థితుల్లో ఎన్డీఎకు సహకరించామని చెప్పారు.   

మంగళవారం ఆయన 13 జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ వ్యూహకర్తగా దేవ్ ను పరిచయం చేస్తూ ఎన్నికల ప్రణాళికలు, సంస్థాగత నిర్మాణపరమైన విధానాల రూపకల్పనలకు దేవ్ పార్టీ ఉంటారని, గత నెలలుగా జనసేనకు పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

కొద్ది మంది చేతుల్లో, కొన్ని కుటుంబాల చేతుల్లోనే రాజకీయాలు ఉండిపోవడంతో అబివృద్ధి, దాని ఫలాలు అందరికీ చెందడం లేదని ఆయన అన్నారు. అందరికీ న్యాయం జరగడం లేదని అన్నారు. 

ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు క్షేత్ర స్థాయి పరిస్థితులు, సమస్యలు, ప్రజల ఇబ్బందులపైన అవగాహన అవసరమని ఆయన అన్నారు. అవేవీ లేకుండా పోటీ చేసి గెలిస్తే ఎప్పటికీ నేర్చుకునే అవకాశం ఉండదని ఆయన అన్నారు.  

తాను కామన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సిపిఎఫ్) ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు దేవ్ టీమ్ కలిసి ఎన్నికల ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారని అన్నారు. 1200 మంది సిపిఎఫ్ కార్యకర్తలు దేవ్ కు సహకరిస్తారని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజా సమస్యలను తెలియపరిచే విధంగా ప్రజల్లోకి వెళ్దామని, ఈ నెల 11వ తేదీలోగా ఈ పర్యటనలకు సంబంధిచిన వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. 

దేవ్ మాటలు ఇవీ...

జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వివిధ పార్టీలతో కలిసిన అనుభవం ఉందని దేవ్ అన్నారు. ఈ రంగంలో దశాబ్ద కాలంగా ఉన్నానని, గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్ అని ఆయన అన్నారు. ఎన్నికలప్పుడు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయే సీజన్డ్ పొలిటీషియన్ కారని అన్నారు. 

Last Updated 1, May 2018, 4:42 PM IST