ఎన్నికల వేడి: జగన్, పవన్ సైతం అమరావతి నుంచే...

By Nagaraju penumalaFirst Published Feb 1, 2019, 4:54 PM IST
Highlights


టీడీపీకి తాత్కాలిక కార్యాలయం ఉండగా, రాజధాని పరిధిలోని చినకాకానిలో జాతీయ రహదారికి ఆనుకొని భారీ కార్యాలయాన్ని టీడీపీ నిర్మిస్తోంది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కార్యాలయం గుంటూరు సమీపంలోని కాజాలో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో జగన్ కూడా తన మకాంను పూర్తిగా అమరావతికి తరలిస్తుండటంతో రాజధాని కేంద్రంగా రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నువ్వా నేనా అన్నరీతిలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమరానికి కాలుదువ్వుతున్నాయి. అటు జనసేన పార్టీ సైతం అధికారం తమదేనంటూ ధీమాగా ఉంది. 

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఏపీలో జరుగుతున్న రాజకీయాలు ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన పార్టీల అధినేతలు ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. 

ఒక వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా నది ఒడ్డునే నివాసం ఏర్పాటు చేసుకుని పాలన అందించడంతోపాటు రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహరచన చేస్తున్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కృష్ణమ్మ చెంత తన రాజకీయాలకు పదునుపెడుతున్నారు. 

నూతన పార్టీ కార్యాలయంలో ఆయన రాష్ట్రంలోని 13 జిల్లాల నేతలతో వరుస సమీక్షలునిర్వహించారు. మరోవైపు వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం కృష్ణమ్మ చెంత వాలిపోయేందుకు ముహూర్తం కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు మరో 3నెలల సమయం మాత్రమే ఉంది.  

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వేడి మెుదలైంది. ఇప్పటికే రాష్ట్ర రాజధానిలో తెలుగుదేశం, జనసేన పార్టీలు మకాం వెయ్యడంతో అదే తరహాలో పయనించేందుకు వైఎస్ జగన్ సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, పార్టీ వర్గాలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా రాజధాని అమరావతికి తన మకాం మార్చేపనిలో పడ్డారు వైఎస్ జగన్. 

ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసుకుని ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వ్యూహరచన చేస్తున్నారు. అన్నపిలుపు, శంఖారావం వంటి కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్నికల మూడ్ వచ్చెయ్యడంతో ఇక జగన్ తన మకాం మార్చేందుకు ముహూర్తం కూడా పెట్టించుకున్నారు. 

ఫిబ్రవరి 14న ఉదయం 8.21 నిమిషాలకు జగన్ తన నూతన గృహప్రవేశం చెయ్యనున్నారు. దీంతో రాజధాని పరిధిలోని కృష్ణా నది ఒడ్డున తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం నిర్మాణం పనులను పూర్తి చేసే పనిలో పడింది సిబ్బంది. దాదాపుగా పూర్తయింది.

పార్టీ కార్యాలయం, ఇల్లు రెండూ దాదాపు పూర్తి కావడంతో భవనాలకు మెురుగులు దిద్దే పనిలో పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జగన్ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి అమరావతి నుంచే పార్టీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

జగన్ అమరావతికి ఎంత త్వరగా మకాం మారిస్తే  అంత త్వరగా రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై పూర్తిగా దృష్టిసారించే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం అమరావతిలో కాంగ్రెస్, బీజేపీ, జనసేనలకు పార్టీ కార్యాలయాలున్నాయి. 

టీడీపీకి తాత్కాలిక కార్యాలయం ఉండగా, రాజధాని పరిధిలోని చినకాకానిలో జాతీయ రహదారికి ఆనుకొని భారీ కార్యాలయాన్ని టీడీపీ నిర్మిస్తోంది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కార్యాలయం గుంటూరు సమీపంలోని కాజాలో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో జగన్ కూడా తన మకాంను పూర్తిగా అమరావతికి తరలిస్తుండటంతో రాజధాని కేంద్రంగా రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.
 

click me!