అంతర్జాతీయ క్రికెట్‌లోకి కోన భరత్ అరంగేట్రం.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు..

By Sumanth KanukulaFirst Published Feb 9, 2023, 1:38 PM IST
Highlights

భారత క్రికెట్ జట్టులోకి క్రికెటర్‌ కోన శ్రీకర్ భరత్ అరంగేట్రం చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. 

భారత క్రికెట్ జట్టులోకి క్రికెటర్‌ కోన శ్రీకర్ భరత్ అరంగేట్రం చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన కేఎస్ భరత్.. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో టీమిండియాలోకి కేఎస్ భరత్ ఎంట్రీపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘మన కోన శ్రీకర్ భరత్..  ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టుతో భారత క్రికెట్ జట్టులో ఈరోజు అరంగేట్రం చేస్తున్నారు. ఆయనకు నా అభినందనలు, శుభాకాంక్షలు. తెలుగు జెండా రెపరెపలాడుతోంది!’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. 

ఇక, తొలి  టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న కేఎస్ భరత్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా శుభాకాంక్షలు తెలియాజేశారు. అతను మన దేశం గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. 

ఇదిలా ఉంటే.. బోర్డర్-గవస్కర్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది. ఈ క్రమంలోనే తొలి టెస్టు ఆడుతున్న కేఎస్ భరత్.. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు స్టేడియానికి హాజరైన తన తల్లిని కౌగిలించుకున్నారు. కేఎస్ భరత్ తన తల్లిని కౌగిలించుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

Our very own is debuting today with the Indian Cricket Team in the ongoing test against Australia. My congratulations and best wishes to him.
The Telugu flag continues to fly high! pic.twitter.com/KlDACbHBhF

— YS Jagan Mohan Reddy (@ysjagan)


ఇక, కోన శ్రీకర్ భరత్ 1993లో జన్మించాడు. అతడు 2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కొన్నాళ్లు భారత్ ఏ జట్టులో కొనసాగాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కొన్ని  ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడాడు.  2021 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు కేఎస్ భరత్‌కు పిలుపువచ్చింది. అయితే చివరి జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అయితే ఓ మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా గాయపడడంతో అతని ప్లేస్‌లో శ్రీకర్ భరత్.. వికెట్ కీపింగ్ చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్ సమయానికి సాహా కోలుకోవడంతో భరత్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇటీవల బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా టెస్టు జట్టుకు ఎంపికైనప్పటికీ.. రెండు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితమయ్యాడు. 

click me!