ఈనాడులో చంద్రబాబు సినిమా, టైటిల్ ఇదీ: వైఎస్ జగన్

First Published Jun 26, 2018, 6:08 PM IST
Highlights

కోనసీమలో కాపులపై కేసులు పెట్టించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారిని చిత్రహింసలు పెడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.

అమలావురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సినిమాను ఈనాడు దినపత్రికలో చూస్తామని, ఆ సినిమా పేరు ఎన్నికలకు ఆరు నెలల ముందు నాలుగు నెలల కోసం అని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

కోనసీమలో కాపులపై కేసులు పెట్టించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారిని చిత్రహింసలు పెడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం అమలాపురంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

కోనసీమలోని ప్రతి పోలీసు స్టేషన్ లో కాపులపై కేసులు పెట్టించారని, కాపులను చంద్రబాబు సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి, తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు కొత్త సినిమా చూపిస్తున్నారని, ఏది చేసినా ఎన్నికలకు ఆరు నెలల ముందు నాలుగు నెలల కోసం ఆ సినిమా టైటిల్ అని ఆయన అన్నారు. 

చంద్రబాబు దోపిడీకి ఆస్కార్ అవార్దు కూడా సరిపోదని జగన్ అన్నారు. బిజెపితో కలిసి ఉన్నంత వరకు చంద్రబాబుకు సమస్యలు గుర్తుకు రాలేదన ిఅన్నారు. కోనసీమలో గోదావరి ఉన్నా తాగునీరు, సాగునీరు దొరకదని అన్నారు. రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఏమయ్యాయని ఆయన అడిగారు. చంద్రబాబు పాలనలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని ప్రశ్నించారు. 

హాస్టళ్లలో చంద్రబాబు కోడి కూర పెడుతారట, ఆరు నెలల ఎన్నికలకు ముందు నాలుగు నెలల కోసం అని ఆయన అన్నారు. చంద్రబాబుకు అంగన్ వాడీ మీద ప్రేమ అంటూ ఈనాడులో రాశారని గుర్తు చేస్తూ అంగన్ వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించారని, విజయవాడలో లాఠీ చార్జీ చేయించి పోలీసు స్టేషన్ లో పెట్టించారని ఆయన అన్నారు. ఆరు నెలల ముందు నాలుగు నెలల కోసం నిరుద్యోగ భృతి ఇస్తారట, కేవలం వేయి రూపాయలట అని జగన్ అన్నారు. కేవలం పది లక్షల మందికి మాత్రమే ఇస్తారట, నాలుగు నెలల కోసమే ఇస్తారట అని అన్నారు.

చంద్రబాబు సినిమా ఈనాడు దినపత్రికలో చూస్తామని ఆయన అన్నారు.  క్లైమాక్స్ లో మాత్రం అందరి సమస్యలను పరిష్కారిస్తానని చెబుతారని అన్నారు.  ఈనాడు దినపత్రికలో చంద్రబాబు కరపత్రాలు వస్తున్నాయని ఆయన అన్నారు. నాలుగేళ్ల పాటు బిజెపితో సంసారం చేసినప్పుడు కడప ఉక్కు కర్మాగారం గుర్తుకు రాలేదని, ఎన్నికలకు ఆరు నెలల ముందు నాలుగు నెలల కోసం గుర్తు వస్తుందని అన్నారు. చంద్రబాబు ఎప్పుడూ మారడని, కుక్క తోక వంకర అని అన్నారు. 

ఎలుక తోలు తెచ్చిన ఎన్నాళ్లు ఉతికినా, నలుపు నలుపే గానీ తెలుపు రాదు అనే వేమన పద్యం చదివి చంద్రబాబు అటువంటివారని జగన్ అన్నారు. 

click me!