ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా, ముందస్తుకు వెళ్లం: నారా లోకేష్

First Published Jun 26, 2018, 5:43 PM IST
Highlights

 వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేయడానికి మంత్రి నారా లోకేష్ సిద్ధపడుతున్నారు.

అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పోటీ చేయడానికి మంత్రి నారా లోకేష్ సిద్ధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన మంగళవారం స్వయంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఆయన అన్నారు. 

తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

తాము విభజన చట్టం హామీల అమలు కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కడప ఉక్కు కర్మాగారంపై తాము చేస్తున్న పోరాటం నిస్వార్థమైందని అన్నారు. నిరుద్యోగ భృతిపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వస్తుందని చెప్పారు. 

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఐదేళ్లు పాలించాల్సిందిగా ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని వెల్లడించారు. 

తనపై అవినీతి ఆరోపణలు చేసే వారు ఆధారాలతో రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని సూచించారు. ఐటీ రంగంలో 2లక్షల ఉద్యోగాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. వైఎస్ హయాంలో కుప్పానికి మీటర్ రోడ్డు కూడా వేయలేదని ఆరోపించారు.  కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం పులివెందులకు రోడ్డు వేసినట్లు తెలిపారు. 

నారా లోకేష్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. 

click me!