టార్గెట్ 2019: వామపక్షాలతో పవన్ పొత్తు ఖరారు

First Published Jun 26, 2018, 5:29 PM IST
Highlights

2019లో లెఫ్ట్, జనసేన మధ్య పొత్తులు

అమరావతి: 2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్టు  వామపక్షాలు  ప్రకటించాయి.జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో సమావేశమై  ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్టుగా సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి  రామకృష్ణ ప్రకటించారు.

గత ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కానీ, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్ధులకు మద్దతుగా ఆ పార్టీ ప్రచారం చేసింది. కానీ, వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ, బీజేపీకి దూరంగా ఉంటామని ప్రకటించింది. దీంతో వామపక్షాలతో కలిసి పోటీ చేయాలని జనసేన నిర్ణయం తీసుకొంది.

ఇటీవల కాలంలో వామపక్షాలతో కలిసి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  పలు పోరాట కార్యక్రమాలను నిర్వహించారు. అయితే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రెండు రోజుల క్రితం  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో  పొత్తులపై చర్చించారు.  ఈ సమావేశంలో వామపక్షాలతో కలిసి జనసేన పోటీ చేయాలని నిర్ణయం తీసుకొంది.. సీపీఐతో పాటు సీపీఎం కూడ జనసేనతో కలిసి పోటీ చేయనున్నట్టు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ మంగళవారం నాడు ప్రకటించారు.

వైసీపీకి జనసేన  మద్దతు ఇవ్వనున్నట్టు తనతో పవన్ కళ్యాణ్ చెప్పారని  వైసీపీ మాజీ  ఎంపీ  వరప్రసాద్ ఇటీవల ప్రకటించారు. అయితే తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన ప్రకటన ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులకు సంకేతంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన నేపథ్యంలో  వామపక్షాలతో పాటు  ఆమ్ ఆద్మీ, లోక్‌సత్తా పార్టీలను కూడ కలుపుకొని  పోటీ చేసే యోచనలో కూడ ఈ పార్టీలు ఉన్నాయి.

అయితే ఏ పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు, ఏ జిల్లాల్లో ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనే విషయమై ఎన్నికల సమయంలో చర్చించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే  వామపక్షాలతో కలిసి మరిన్ని పోరాట కార్యక్రమాల్లో జనసేన పాల్గొనే అవకాశం ఉందని వామపక్ష నేతలు చెబుతున్నారు.


 

click me!