
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రెండో రోజు సీబీఐ విచారణ ముగిసింది. దాదాపు 8 గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. కాగా.. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి వరకు ఆయనను విచారించుకోవచ్చని సూచించింది. దీంతో అవినాష్ రెడ్డి వరుసగా రెండో రోజు సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాష్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. నిందితులతో జరిపిన లావాదేవీలపై అవినాష్ ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా రూ.40 కోట్ల డీల్‌పైనా ఆరా తీశారు. అటు ఈ కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇకపోతే.. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరికి అప్రూవర్ హోదా కల్పించిన సీబీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వివేకానందరెడ్డి మాజీ పీఏ ఎంవీ కృష్ణారెడ్డి, వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా దస్తగిరిని అప్రూవర్‌గా మార్చొద్దని భాస్కరరెడ్డి, కృష్ణారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని దస్తగిరికి నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు జూన్ మూడో వారానికి వాయిదా వేసింది.
ALso Read: వైఎస్ అవినాష్ రెడ్డికి ట్విస్టిచ్చిన సునీతారెడ్డి:: మధ్యంతర బెయిల్ పై సుప్రీంలో పిటిషన్
ఈ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా 2019 మార్చిలో పులివెందులలో వివేకానందరెడ్డిని హతమార్చిన గొడ్డలిని దస్తగిరి కొనుగోలు చేశారని చెప్పేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని కృష్ణారెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకానందరెడ్డిపై దాడి చేసి హత్య చేసిన నలుగురిలో దస్తగిరి ఒకడని చెప్పారు. అయినప్పటికీ సీబీఐ దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడానికి అనుమతించిందని.. బెయిల్ పొందడానికి సహాయపడిందని అన్నారు. వాచ్‌మెన్ రంగయ్య హంతకులందరినీ గుర్తించాడని.. వారిలో దస్తగిరి ఒకరని తెలిపారు. ఇక, భాస్కర్ రెడ్డి కూడా దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన కూడా ఇదే రకమైన అభ్యర్థన చేశారు.
అయితే దస్తగిరికి ట్రయల్ కోర్టు ఇచ్చిన అప్రూవర్ హోదాను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సీబీఐ వ్యతిరేకించింది. ఈ విషయంలో పిటిషనర్లకు లోకస్ స్టాండియే లేదని కోర్టుకు తెలిపింది. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలమే తమ సాక్ష్యం అని చెప్పడం సరికాదని.. ఇతర ఆధారాలను కూడా సేకరించామని సీబీఐ కోర్టుకు తెలిపింది.