ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టీం లో యువ తెలుగు ఐఏఎస్ కు చోటుదక్కనుంది. స్వయంగా పవన్ ఏరికోరి ఇతడిని తన ఓఎస్డిగా నియమించుకునేందుకు సిద్దమయ్యారు. ఇంతకూ ఎవరా ఐఏఎస్..?
అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం తర్వాత పవన్ కల్యాణ్ పేరు మారుమోగుతోంది. గత ఎన్నికల్లో కేవలం ఒక్కసీటును గెలిచిన స్థాయి నుండి ఇప్పుడు పోటీచేసిన ఒక్కచోట కూడా ఓడిపోని స్థాయికి జనసేన పార్టీని తీసుకెళ్లారు పవన్. ఇలా సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తాను పవర్ స్టార్ అని నిరూపించారు పవన్. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నుండి సామాన్య ప్రజలు సైతం పవన్ కల్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి భారీ మెజారిటీతో విజయం సాధించిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించిన కింగ్ మేకర్ పవన్ కల్యాణ్ పాలనలోనూ తన మార్క్ చూపించేందుకు సిద్దమయ్యారు. డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ది, పంచాయితీరాజ్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే తన టీమ్ ను రెడీ చేసుకునే పనిలో పడ్డారు పవన్.
పవన్ కల్యాణ్ తన ఓఎస్డి (ఆఫీసర్ ఇన్ స్పెషల్ డ్యూటీ) గా తెలుగు ఐఎఎస్ మైలవరపు కృష్ణతేజను నియమించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. పవన్ కోరిక మేరకు కృష్ణతేజను డిప్యుటేషన్ పై ఆంధ్ర ప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సిద్దమయ్యారు. ఐఎఎస్ కృష్ణతేజ కోసం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసారు చంద్రబాబు.
ఎవరీ కృష్ణతేజ :
ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందినవాడే ఈ కృష్ణతేజ. చిన్నప్పటినుండి చదువులో చురుగ్గా వుండే ఇతడి విద్యాభ్యాసమంతా స్థానికంగానే పూర్తయ్యింది. నరసరావుపేటలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీ నుండి కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసిన కృష్ణతేజ సివిల్స్ కోసం హైదరాబాద్ కు చేరుకున్నాడు.
2009 నుండి అవిశ్రాంతంగా కష్టపడి ఎట్టకేలకు 2014 లో 66 ర్యాంకు సాధించి ఐఎఎస్ కు ఎంపికయ్యాడు కృష్ణతేజ. 2015 లో శిక్షణ పూర్తిచేసుకున్న ఇతడికి కేరళ క్యాడర్ లభించింది. మొదటి పోస్టింగ్ అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్... ఆ తర్వాత కేరళ పర్యటకాభివృద్ది సంస్థ ఎండీ, పర్యటకశాఖ డైరెక్టర్, ఎస్సి అభివృద్ది శాఖ డైరెక్టర్ గా ఉన్నత పదవులు పొందారు.
అలా పవన్ దృష్టిలో..:
కేరళలో వివిధ హోదాల్లో పనిచేసిన కృష్ణతేజ గతేడాది 2023 లో త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే అతడు మానవత్వంలో చేసిన ఓ గొప్పపని అతడికి దేశస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన దాదాపు 609 మంది చిన్నారులను అక్కున చేర్చుకున్న కృష్ణతేజ దాతల సాయంతో చదువుకునే ఏర్పాటుచేసారు. ఇలా కలెక్టర్ కృష్ణతేజ సహకారంతో అనాధ పిల్లలు హాయిగా చదువుకుంటున్నారు.
ఇలా కృష్ణతేజ నిస్వార్థంతో చేసిన సేవలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. వందలాదిమంది అనాధ పిల్లలు చదువుకునే ఏర్పాటుచేసిన కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమీషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. దీంతో దేశవ్యాప్తంగా కృష్ణతేజ పేరు మారుమోగింది... దీంతో అతడు పవన్ కల్యాణ్ దృష్టిలో పడ్డారు.
కృష్షతేజ తెలుగు కుర్రాడని తెలియడంతో అతడిని అభినందించారు పవన్ కల్యాణ్. ఆ తర్వాత కృష్ణతేజ గురించి తెలుసుకున్న పవన్ తన టీంలో అతడుంటే బావుంటుందని భావించారు. దీంతో వెంటనే కృష్ఱతేజను తన ఓఎస్డిగా నియమించుకోవాలనుకుని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కోరిక మేరకు కృష్ణతేజను ఏపీ తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.