నాటి నుంచి నేటి వరకు వెంకన్నే చంద్రన్నకు రక్ష!

By Galam Venkata Rao  |  First Published Jun 21, 2024, 7:53 PM IST

తిరుమల శ్రీవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరమ భక్తుడు. ఆయన జీవితంలో ఏ ముఖ్యం ఘట్టం జరిగినా తిరుమల కొండకు వెళ్లి.. వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటారు.  


చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ- జనసేన- బీజేపీ కూటమికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మరోసారి పట్టం కట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా 161 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు. అలా గెలిచాక, జూన్ 12న ముఖ్యమంత్రిగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. 

ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన రోజు సాయంత్రమే కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు బయలుదేరారు. సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు, మనువడు దేవాన్ష్‌తో కలిసి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నరు. 

Latest Videos

ఇలా తన జీవితంలో ఏ మంచి జరిగినా, కష్టం ఎదురైనా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం పరిపాటి. 

నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నారావారి పల్లె గ్రామంలో జన్మించారు. పొరుగు గ్రామమైన శేషాపురంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి... తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉండే చంద్రగిరిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆ తర్వాత 1972లో తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీఏ పట్టా పొందారు. 1974లో ఎస్వీ యూనివర్సిటీలోనే ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు.. తొలిసారి 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు రాజకీయ జీవితం తిరుమల వెంకన్న పాదల చెంతనే మొదలైంది. 1980లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమ, పురావస్తు శాఖల మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 

ఆ తర్వాత దివంగత ఎన్‌టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెట్టిన చంద్రబాబు... అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్‌టీఆర్‌ హయాంలోనూ వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1995 నుంచి 2004 వరకు రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో 2003 అక్టోబర్ 1 తిరుపతిలో అలిపిరి వద్ద చంద్రబాబుపై హత్యాయత్నం జరిగింది. అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్‌ ఘటనలో 12 క్లైమోర్ మైన్స్‌ పెట్టి.. పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ పేల్చగా.. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బతికి బయటపడ్డారు  నారా చంద్రబాబు నాయుడు.

అప్పటి నుంచి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా మారిపోయారు చంద్రబాబు. ఆయన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఆయన జీవితంలో ఏ ముఖ్య ఘట్టం నమోదైన తిరుమలకు వెళ్లి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడం పరిపాటిగా మార్చుకున్నారు. కుటుంబ సమేతంగా దేవాన్ష్ ప్రతి పుట్టినరోజుకు తిరుమల వెళ్లి ఆశీస్సులు పొందడంతో పాటు దేవాన్ష్‌తో అన్నదానం చేయిస్తారు. ఈ ఎన్నికల్లోను విజయం సాధించిన వెంటనే తిరుమల వెళ్లి వారి ఆశీస్సులు పొందారు చంద్రబాబు. అలా అసెంబ్లీలోని తన ఛాంబర్‌లోనూ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచడం ద్వారా కలియుగ వైకుంఠనాథుడు వేంకటేశునిపై తనకు ఉన్న భక్తి ప్రభత్తులను తెలియచెప్పారు. 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో సభలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణానికి ముందు అసెంబ్లీ ప్రాంగణంలోని తన ఛాంబర్ కి వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీలోకి అడుగుపెట్టి.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. 

 

click me!