లైంగిక వేధింపులు: కొందరు బెదిరించారు.. ఆ అధికారికి నాకు సంబంధం లేదు, మాటమార్చిన యువతి

By Siva KodatiFirst Published Jun 12, 2021, 11:17 PM IST
Highlights

పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన అధికారి తనకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి శారీరకంగా వాడుకున్నారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గంటల వ్యవధిలోనే సదరు యువతి మాట మార్చేసింది. 

పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన అధికారి తనకు ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పి శారీరకంగా వాడుకున్నారంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గంటల వ్యవధిలోనే సదరు యువతి మాట మార్చేసింది. తనను కొందరు బెదిరించి, సదరు అధికారికి వ్యతిరేకంగా వీడియో స్టేట్‌మెంట్ ఇప్పించారని ఆరోపించింది. తన వ్యక్తిగత వీడియోలతో బెదిరించారని.. తాము చెప్పినట్లు చేస్తే ఉద్యోగం ఇప్పిస్తామని బ్లాక్ మెయిల్ చేశారని ఆ యువతి చెప్పింది. ఇందుకు సంబంధించి మరో వీడియో విడుదల చేసింది. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీడీఏ పీవోను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

 

 

అంతకుముందు రిలీజ్ చేసిన వీడియోలో.. తాను టిటిసి పూర్తి చేయడంతో ఉద్యోగం వస్తుందని ఇద్దరు వ్యక్తులు నమ్మించి సదరు అధికారి వద్దకు తీసుకెళ్లారని ఆమె తెలిపారు. తన పరిస్ధితిని అదునుగా చేసుకున్న అధికారి తనను శారీరకంగా లోబరచుకున్నారని ఆరోపించింది. తనతో కోరికలు తీర్చుకుని ఉద్యోగం ఇవ్వలేదని.. దీనిపై అడిగేందుకు వెళ్లిన ప్రతిసారీ మళ్లీ కోరిక తీర్చాలని వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆమె సంచలన ఆరోపణలు చేసింది.

Also Read:కొలువు కావాలంటే కోరిక తీర్చాల్సిందే.. లోబరుచుకుని, పదేపదే అత్యాచారం: యువతి వీడియో వైరల్

తాను మోసపోయానని గ్రహించి మరొక మహిళకు అన్యాయం జరగకూడదని ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు చెప్పింది. తనకు న్యాయం జరిగేవరకు వీడియో సీఎం వరకు వెళ్లేదాకా అందరూ షేర్ చెయ్యాలంటూ బాధిత మహిళ కోరింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏజెన్సీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సద్దుమణిగించేందుకు అధికార పార్టీ నేతలతో పాటు పలువురు అధికారులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఒక కీలక పోలీస్ అధికారి సైతం మహిళతో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 

click me!