వైసీపీ వెబ్‌సైట్ ఎంపీల లిస్ట్‌‌లో రఘురామ పేరు తొలగింపు.. రెబల్ నేతకు జగన్ ఝులక్

Siva Kodati |  
Published : Jun 12, 2021, 09:55 PM IST
వైసీపీ వెబ్‌సైట్ ఎంపీల లిస్ట్‌‌లో రఘురామ పేరు తొలగింపు.. రెబల్ నేతకు జగన్ ఝులక్

సారాంశం

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సమరం కొనసాగించే ఉద్దేశంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఆయన జగన్ కు లేఖలు సంధిస్తూ వస్తున్నారు. 

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సమరం కొనసాగించే ఉద్దేశంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఆయన జగన్ కు లేఖలు సంధిస్తూ వస్తున్నారు. శుక్రవారం ఆయన వృద్ధాప్య పింఛన్లపై జగన్ కు లేఖ రాశారు. శనివారంనాడు పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాలపై లేఖను సంధించారు. 

అధికారంలోకి వస్తే పెళ్లి కానుక సాయం పెంచుతామని వైసీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ సాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని ప్రకటించిందని చెప్పారు. పెళ్లి కానుక సాయం పెంపుపై ప్రజల నుంచి ఎన్నికల్లో మద్దతు లభించిందని, అందువల్ల ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు.  ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఆయన జగన్ ను కోరారు. 

Also Read:నాపై అనర్హత వేటు సాధ్యం కాదు.. భరత్ కు రఘురామ కౌంటర్

అటు కేంద్రమంత్రులు, లోక్‌సభ స్పీకర్, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎంపీలకు రఘురామ వరుసపెట్టి లేఖలు రాస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తనపై అక్రమ కేసులు పెట్టారని, సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ జాతీయ స్థాయిలో మద్ధతు కూడగడుతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందిగా పిటిషన్ వేసినందుకే తనను టార్గెట్ చేశారంటూ ఆ లేఖల్లో పేర్కొంటున్నారు. 

తాజాగా శనివారం రఘురామ మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపీల జాబితా నుంచి తన పేరు తొలగించారంటూ మండిపడ్డారు. పార్టీ నుంచి వైసీపీ అధినేత జగన్ తనను బహిష్కరించలేదని రఘురామ అన్నారు. దీనిపై తనకు ఏం అర్ధంకావడం లేదని ఎవరైనా చెప్పగలరా అంటూ రఘురామకృష్ణమరాజు ప్రశ్నలు సంధించారు. మరోవైపు వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ లోక్‌సభ స్పీకర్‌ను కలిసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామపై అనర్హత వేటు వేయాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపైUnion Minister Chandra Sekhar Pemmasani Speech | Asianet News Telugu
3వ ప్రపంచ తెలుగు మహాసభలు | Ayyannapatrudu Chintakayala Powerful Speech | Asianet News Telugu