యోగాంధ్ర 2025: రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులు యోగా ఉత్సవాలు

Published : May 26, 2025, 01:05 AM IST
Yogandhra, Yoga

సారాంశం

Yogandhra 2025: ఆంధ్రప్రదేశ్‌లో మే 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర 2025 కార్యక్రమం కింద యోగా ప్రదర్శనలు, శిక్షణలు, పోటీలు నిర్వహిస్తున్నారు.  

Yogandhra 2025: జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున్న కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'యోగాంధ్ర 2025' పేరిట నెల రోజుల రాష్ట్రవ్యాప్తంగా యోగా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. మే 21న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు జూన్ 21వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ఆరోగ్య, వైద్య-కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

ఈ మేరకు ఒక ప్రకటనలో శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యోగా ప్రదర్శనలు, పోటీలు, శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు, చారిత్రక స్థలాల్లో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించటం ద్వారా ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఉందన్నారు.

ప్రతి వారానికి ప్రత్యేక థీమ్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటి వారంలో అనంతపురం, కర్నూలు, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించగా, తదుపరి వారాల్లో గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, కడప, విజయనగరం, కాకినాడ, కోనసీమ, శ్రీహరికోట వంటి ప్రాంతాల్లో యోగా ప్రదర్శనలు జరుగనున్నాయి.

ప్రతి వర్గానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలు, యువత, వృద్ధులు, రైతులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక కార్మికులు, వ్యాపారులు, మహిళా స్వయం సహాయక బృందాలు, ఆటగాళ్లు, సాంస్కృతిక కళాకారులు, సైనికులు తదితర వర్గాల కోసం ప్రత్యేకంగా థీమ్ ఆధారిత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున బాపట్ల సూర్యలంక బీచ్, రామాపురం బీచ్, అనంతపురం లేపాక్షి దేవాలయంలో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించనున్నారు. యోగాసన పోటీలు, సామూహిక యోగాభ్యాసం, మిశ్రమ వయస్సుల గ్రూప్ యోగా వంటి కార్యక్రమాలు ఉంటాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2,600 మంది మాస్టర్ ట్రైనర్లను శిక్షణ ఇచ్చి, వారిచే 1,25,000 గ్రామ, పట్టణ స్థాయి యోగా శిక్షకులను తయారుచేస్తోంది. వీరిపైగా ఆధారపడి రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

పోటీల్లో మూడు వయస్సు వర్గాలు ఏర్పాటు చేశారు. 10 నుండి 18 సంవత్సరాల వరకు జూనియర్, 19 నుండి 35 సంవత్సరాల వరకు యంగ్, 35 సంవత్సరాలకు పైబడి సీనియర్ వర్గాలు. ఆసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం, గ్రూప్ యోగా, యోగా పాటలు, చిత్రలేఖనం, నాటకం, నాట్యం, క్విజ్, పోస్టర్, వ్యాసం, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ, ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు.

ప్రజలకు ఈ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించేందుకు మే 27న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ఇంటింటికీ ప్రచారం, కరపత్రాల పంపిణీ వంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. వార్తా పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వం మీడియా సంస్థలను కోరింది.

ఇది యోగా పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు చేపడుతున్న భారీ ప్రచార కార్యక్రమం కావడంతో, యోగా గురువులు, శిక్షకులు, వాలంటీర్లు, సాధారణ ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం కోరుతోంది. పూర్తి షెడ్యూల్‌ను ఆరోగ్య శాఖ విడుదల చేయగా, మరిన్ని వివరాల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయాలు లేదా స్థానిక ఆరోగ్య అధికారులను సంప్రదించాలని సూచించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu
Rajamahendravaram Milk adulterated: కల్తీ పాల బాధితులను పరామర్శించిన అధికారులు| Asianet News Telugu