వైసిపి పోలవరం యాత్ర..ఈటైంలో ఎందుకో ?

First Published Dec 4, 2017, 6:37 AM IST
Highlights
  • పోలవరం ప్రాజెక్టు చుట్టూ వివాదాలు ముసురుకుంటున్న నేపధ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి ప్రాజెక్టును సందర్శించాలనుకుంటోంది.

పోలవరం ప్రాజెక్టు చుట్టూ వివాదాలు ముసురుకుంటున్న నేపధ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి ప్రాజెక్టును సందర్శించాలనుకుంటోంది. వైసిపికి చెందిన ఎంపిలు, ఎంఎల్ఏ, ఎంఎల్సీలతో పాటు పలువురు సీనియర్ నేతలు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబునాయుడు భారీ అవినీతికి పాల్పడ్డారని వైసిపి మొదటి నుండి ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కొంత కాలంగా ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు-కేంద్రప్రభుత్వం మధ్య కూడా బాగా గ్యాప్ వచ్చిన సంగతి వాస్తవం.

అవకాశం దొరికినపుడల్లా పోలవరంకు సంబంధించి చంద్రబాబు కేంద్రాన్ని జనాల ముందు దోషిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు పనులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం తాజాగా పిలిచిన అంతర్జాతీయ టెండర్ల వివాదంతో గ్యాప్ మరింత పెరిగింది. టెండర్ ప్ర్రక్రియలో లోపాలున్నాయి కాబట్టి నిలిపేయాలంటూ కేంద్రం ఆదేశించింది. అయితే, ప్రాజెక్టు పనులు జరగనీయకుండా కేంద్రం అడ్డుపడుతోందంటూ చంద్రబాబు ఓవర్ యాక్షన చేసారు. దాంతో ఆశ్చర్యపోయిన కేంద్రం తాను ఇచ్చిన ఆదేశాలేంటనే విషయంలో రాష్ట్ర భాజపా నేతల ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళింది. దాంతో చంద్రబాబు ఇబ్బందుల్లో పడ్డారు.

సరే, తాజా వివాదం ఎలాగున్నా చాలాకాలంగా ప్రాజెక్టు పనులైతే నిలిచిపోయాయన్నది వాస్తవం. ఈ నేపధ్యంలోనే జరిగిన, జరగాల్సిన పనులను క్షేత్రస్ధాయిలో పరిశీలించి వివరాలను తెలుసుకునేందుకు వైసిపి నేరుగా ప్రాజెక్టు వద్దకే వెళ్ళాలని నిర్ణయించింది. ఈనెల 7వ తేదీన ప్రజాప్రతినిధులందరూ కలిసి బస్సుయాత్రగా వెళ్ళాలని నిర్ణయించారు. ఇటీవలే చంద్రబాబు కూడా తన పార్టీ ప్రజాప్రతినిధులను ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్ళిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. వారంటే అధికారపార్టీ వాళ్ళు కాబట్టి ప్రాజెక్టు వద్దకు నేరుగా వెళ్ళి పరిశీలించగలిగారు. మరి ప్రతిపక్షానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందా ? అందులోనూ ఇటువంటి పరిస్ధితుల్లో ?

 

 

 

 

click me!