హత్యలు, హత్యాయత్నాలు, అనుమానాస్పద మరణాలకు అంతులేకుండా పోయింది... రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు.
అమరావతి: సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని... టీడీపీ సహా ఇతర పక్షాలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. హత్యలు, హత్యాయత్నాలు, అనుమానాస్పద మరణాలకు అంతులేకుండా పోయింది... రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడి అరెస్ట్, టిడిపి నాయకుల అరెస్టులు, పంచాయితీ ఎన్నికల్లో వైసిపి అక్రమాలపై నిలదీస్తూ అశోక్ బాబు సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.
అశోక్ బాబు లేఖ యదావిధిగా...
తేది : 03.02.2021
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి గారికి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్
నమస్కారం...
విషయం: రాష్ట్రంలో యధేచ్ఛగా హత్యలు, హత్యాయత్నాలు, అనుమానాస్పద మరణాలు -క్షీణించిన శాంతిభద్రతలు-మానవ హక్కుల ఉల్లంఘన - తప్పుడు కేసులతో తెలుగుదేశం పార్టీ నేతలను వేధించడం - టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడిన నిందితులపై చర్యల గురించి...
* * *
మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలతో సహా ఇతర ప్రతిపక్షాల వారిపై దాడులు, దౌర్జన్యాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, అనుమానాస్పద మరణాలకు అంతులేకుండా పోయింది. రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలు క్షీణించాయి. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. భారత రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన మానవ హక్కులను రాష్ట్రంలో యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, అరెస్టులతో వేధించడం, భౌతిక దాడులకు పాల్పడడం, హత్యలు వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన అందిస్తానని ప్రమాణం చేసిన వారే విద్వేషాలతో, కక్షలతో ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారు. ఇవి రాజ్యాంగ విచ్ఛిన్న చర్యలు.
5 సార్లు శాసనసభ్యుడిగా, టీడీయల్పీ ఉపనేతగా, తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్న కింజారపు అచ్చెన్నాయుడుపై సెక్షన్ 307 హత్యాయత్నం కింద అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయడం హేయం. మారణాయుధాలతో, వందలాది మంది అనుచరులతో ప్రజలకు భయభ్రాంతులకు గరిచేసేలా నిమ్మాడ గ్రామంపై దాడికి వెళ్ళిన దువ్వాడ శ్రీనివాస్ రెచ్చగొట్టే వ్యాఖ్యల వీడియో సాక్ష్యాధారాలున్నా ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. కారు బ్యానెట్‌పై కూర్చుని ''చంపేద్దాం... దాడిచేద్దాం, ఎవరినీ వదలొద్దంటూ'' రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాస్‌పై హత్యాయత్నం (307) కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇద్దరు న్యాయవాదులు దీనిపై ఫిర్యాదు చేసినా కంప్లయింట్ తీసుకోకపోవడం నిందితులను కాపాడే ప్రయత్నమే.
హైకోర్టు జడ్జిలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు నివాసం ఉండే విజయవాడలోని భరత్‌నగర్‌లో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కారును అక్టోబర్ 3, 2020న ధ్వంసం చేసిన విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఇంతవరకు దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నేడు (02.02.2021) పట్టపగలు పట్టాభిరామ్‌పై కర్రలతో, రాడ్లతో హత్యాయత్నం చేశారు. కారును ధ్వంసం చేశారు. ఈ దాడిలో పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. 2 నెలల్లో ఇది వరుసగా పట్టాభిపై రెండో దాడి. వారం రోజుల క్రితం కూడా తెలుగుదేశం పార్టీ పట్టాభికి భద్రత కల్పించే విషయంపై పోలీసు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యం వహించి ఆయన ప్రాణాలకే ముప్పువాటిల్లేలా చేశారు. వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నించడం నేరమా? ఇళ్ల స్థలాల్లో వైసీపీ అవినీతిని బయటపెట్టాడన్న కక్షతో ప్రొద్దుటూరులో టీడీపీ చేనేత నాయకుడు నందం సుబ్బయ్యను పట్టపగలు ఇళ్ల స్థలాల ప్రాంగణంలోనే హత్య చేశారు. గండికోట ముంపు పరిహారంలో అవినీతిని బయటపెట్టిన రిటైర్డ్ కానిస్టేబుల్ గురుప్రతాప్‌రెడ్డిని గ్రామసభ జరిగిన దేవాలయంలోనే హతమార్చారు. పాలకుల అండ చూసుకుని రాష్ట్రంలో ముష్కర మూకలు ఏ విధంగా పేట్రేగిపోతున్నాయో ఈ దుర్ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలు.
చిత్తూరు జిల్లా యాదమర్రి గ్రామంలో తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు రాజ నరసింహులు (దొరబాబు) అభ్యర్థులతో సహా ఎంపీడీవో కార్యాలయానికి వెళుతుంటే వైసీపీ శ్రేణులు దాడికి కారును ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలను బెదిరించి ఎన్నికలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకోవాలన్న దురుద్దేశ్యంతో వైకాపా రౌడీలు ఈ దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి వీడియో సాక్ష్యాధారాలు ఉన్నా కూడా ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో సర్పంచ్‌గా నామినేషన్ వేస్తున్న తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్‌రెడ్డిని జనవరి 30న కిడ్నాప్ చేశారు. వాళ్ల చెర నుంచి బయటపడిన శ్రీనివాస్‌రెడ్డి తన భార్య నామినేషన్ ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లిన శ్రీనివాసరెడ్డి అదేరోజు పొలంలో అనుమానాస్పదంగా ప్రాణాలు కోల్పోవడం సందేహాస్పదం. కక్షగట్టి శ్రీనివాస్‌రెడ్డిని హత్య చేసి వ్రేలాడదీసి ఆత్మహత్యగా చిత్రించారని స్థానిక ప్రజలే చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ నేతలపై హత్యలు, హత్యాయత్నాలు, అనుమానాస్పద మరణాలు, భౌతిక దాడులకు పాల్పడిన నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తున్నాం. అనుమానాస్పద మరణాల వెనుక నిజానిజాలను బహిర్గతం చేయాలని కోరుతున్నాం.
1. దువ్వాడ శ్రీనివాస్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి.
2. తెలుగుదేశం నేతల ఇళ్లకొచ్చి బడితపూజ చేస్తానన్న మంత్రి కొడాలి నాని, అతనికి వత్తాసు పలికిన వల్లభనేని వంశీల ప్రోద్భలంతోనే పట్టాభిపై హత్యా ప్రయత్నం జరిగింది కాబట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీలపై 307 కేసు నమోదు చేయాలి.
3. గొల్లలగుంట శ్రీనివాసరెడ్డిది హత్య కేసుగా నమోదు చేయాలి. ఇందులో పోలీసుల పాత్రపై సీబీఐ విచారణ జరిపించాలి.
4. ఎంయల్‌సి దొరబాబుపై దాడి చేసిన వైకాపా రౌడీలపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయాలి.
పి. అశోక్‌బాబు
శాసనమండలి సభ్యులు