హోదా కోసం ఢిల్లీలో వైసిపి భారీ ధర్నా

First Published Mar 5, 2018, 10:51 AM IST
Highlights
  • హోదా సాధన డిమాండ్ తో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందించారు.

ప్రత్యేకహోదా కోసం పార్లమెంటు సంసద్ మార్గ్ లో వైసిపి ధర్నా మొదలైంది. హోదా సాధన డిమాండ్ తో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపుకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందించారు. విజయవాడ నుండి బయలుదేరిన ప్రత్యేక రైలు లో 13 జిల్లాల నుండి పెద్ద ఎత్తున వైసిపి శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నాయి. ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు ప్రతీ నియోజకవర్గం నుండి కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు 15 మందికి తక్కువ కాకుండా ఢిల్లీకి చేరుకున్నారు.

ముందుగా అనుకున్న ప్రకారమే నేతలు, కార్యకర్తలందరూ సోమవారం ఉదయం నుండే సంసద్ మార్గ్ కు చేరుకున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆందోళన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 10.30 గంటల ప్రాంతంలో సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, నేతలంతా ధర్నా స్ధలానికి చేరుకున్నారు. దాంతో చుట్టుపక్కల ప్రాంతమంతా ఏపికి ప్రత్యేకహోదా నినాదాలతో మారుమోగిపోయింది.

అదే సమయంలో కొందరు ఎంపిలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకునేందుకు లోక్ సభలో ఉండిపోయారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి జరగబోయే లాభాలు, ఉపయోగాలు తదితరాలపై నేతలు వివరించారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో మూడున్నరేళ్ళల్లో  వైసిపి చేసిన ఆందోళనలు, నిరసనలు, నిర్వహించిన ప్రత్యేక సదస్సులను కూడా వివరించారు.

 

 

click me!