నంద్యాల ఫలితం: వైసీపీ చాలా నేర్చుకోవాలి

First Published Aug 29, 2017, 5:18 PM IST
Highlights
  • నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత వైసీపీ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి.
  • చంద్రబాబునాయుడును ఏ దశలోనూ తక్కువ అంచనా వేసేందుకు లేదు.
  • టిడిపి గెలుపు ఓ గెలుపే కాదనటం, డబ్బు, ప్రలోభాలకు గురిచేసిందని చెప్పటం లాంటివన్నీ కుంటిసాకులు మాత్రమే అని గ్రహించాలి.
  • అవినీతి, ప్రలోభాలు, ఒత్తిడి, డబ్బులు పంచారని చెప్పటం అవుట్ డేటెడ్ ఆరోపణలన్న విషయాన్ని వైసీపీ గ్రహించాలి.

నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత వైసీపీ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ప్రత్యర్ధి చంద్రబాబునాయుడును ఏ దశలోనూ తక్కువ అంచనా వేసేందుకు లేదు. టిడిపి గెలుపు ఓ గెలుపే కాదనటం, డబ్బు, ప్రలోభాలకు గురిచేసిందని చెప్పటం లాంటివన్నీ కుంటిసాకులు మాత్రమే అని గ్రహించాలి. అవినీతి, ప్రలోభాలు, ఒత్తిడి, డబ్బులు పంచారని చెప్పటం అవుట్ డేటెడ్ ఆరోపణలన్న విషయాన్ని వైసీపీ గ్రహించాలి.

చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేసే బదులు ఎన్నికలో గెలిచేందుకు చంద్రబాబు అనుసరించిన వ్యూహాలపై వైసీపీ అధ్యయనం చేయాలి. టిడిపి అధికారంలో ఉంది కాబట్టి ఉపఎన్నికలో గెలిచిందన్న వాదన నిలవదు.  ఎందుకంటే, నంద్యాలలో వైసీపీ పోటికి దిగేటపుడే టిడిపి అధికార పార్టీ అన్న విషయం గుర్తులేదా?  

గెలుపు కోసం చంద్రబాబు ఏ స్ధాయిలో వ్యూహాలు పన్నుతారో వైసీపీకి తెలీదా? వైసీపీలో ఉన్న పలువురు టిడిపి నుండి వచ్చిన వారే కదా? కాకపోతే సమస్య ఎక్కడ వచ్చిందంటే జనాల్లో ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉందని వైసీపీ భావించింది, నమ్మింది. పోలింగ్ రోజు వరకూ అదే నమ్మకంతో ఉంది కాబట్టే దెబ్బతింది. సరే, ఒక ఎన్నికలో ఓడిపోయినంత మాత్రానే వైసీపీకి వచ్చిన నష్టమేమీలేదు. ఎందుకంటే, వైసీపీకి 70వేల ఓట్లు రావటం చిన్న విషయం కాదు. ఉపఎన్నికలో గెలవటం చంద్రబాబుకు చాలా తేలిక. ఎందుకంటే చంద్రబాబు వ్యూహాలు అంత కట్టుదిట్టంగా ఉంటాయి.

నంద్యాలలో చంద్రబాబు వ్యూహాన్ని వైసీపీ ఎందుకు అధ్యయనం చేయాలంటే భవిష్యత్ ఎన్నికలపై ఇంతకన్నా మెరుగైన వ్యూహాలను అమలు చేయాలి కాబట్టి. మరో ఏడాదిన్నరలో సాధారణ ఎన్నికలొస్తున్నాయి. చంద్రబాబు వ్యూహాలు అన్నీ చోట్లా అప్పుడు పనిచేయకపోవచ్చు. కానీ ఈలోగా ఎక్కడైనా ఉపఎన్నిక అనివార్యమైతే మళ్ళీ  పోరాటం తప్పదు కదా? అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చుకునేందుకు వీలుగా ప్రత్యామ్నాయాలనూ రెడీగా పెట్టుకోవాలి.

ఇంకో విషయమేంటంటే, చంద్రబాబును గురించి జగన్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తనకే ఎందుకు ఓట్లేయాలో ఓటర్లను కన్వీన్స్ చేయగలగాలి. తన అభ్యర్ధి గురించే కాకుండా టిడిపి అభ్యర్ధి గురించి కూడా వివరించాలి. ఎందుకంటే చాలా మంది ఎంఎల్ఏలపై విపరీతమైన ఆరోపణలున్నాయి. అక్కడి ఓటర్లకు చంద్రబాబు అవినీతి కన్నా తమ ఎంఎల్ఏ అవినీతిపైనే ఎక్కువ మంటుంది. కాబట్టి స్ధానిక సమస్యలపైనే  జగన్ ఎక్కువ దృష్టి పెట్టాలి. అదే సమయంలో అన్నీ సామాజికవర్గాలను దగ్గరకు తీసుకునే కసరత్తులు మొదలుపెట్టాలి. అప్పుడే సక్సెస్ రేటు పెరుగుతుంది లేకపోతే జగన్ ప్రతీసారి చంద్రబాబును తిట్టుకుంటూ ఉండాల్సిందే.

 

click me!