వైసీపీలో సీట్ల కేటాయింపు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా గుడివాడ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.
విజయవాడ : గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కొడాలి నానిపై నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి సెగ వెలుగు చూసింది. దీంతో, ఈసారి గుడివాడ టికెట్ కొడాలి నానికి దక్కే అవకాశం కనిపించడం లేదని చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు వైసీపీ విడుదల చేసిన జాబితాలో గుడివాడ సీటు గురించిన క్లారిటీ లేదు. మరోవైపు గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా హనుమంతరావు అనే కాపు అభ్యర్థి ఎన్నిక కాబోతున్నట్లుగా సూచనలు వెలువడుతున్నాయి.
దీనికి తగ్గట్టుగానే.. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలు అంటూ గుడివాడలో చాలాచోట్ల బ్యానర్లు వెలిశాయి. మరోవైపు వైసీపీలోకూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన మండలి హనుమంతరావు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు సీఎంవో నుండి పిలుపు వచ్చిందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో హనుమంతరావుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ నుంచి ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకు పడడంలో కొడాలి నాని ముందుంటారు. ముఖ్యంగా, టిడిపి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతుంటారు. వైసిపికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి నమ్మిన బంటుగా కొడాలి నాని పేరు ఉంది. ఇప్పుడు కొడాలి నానికి గుడివాడ నుంచి టికెట్ ఇవ్వడం లేదనేది పెద్ద షాకింగ్ గా మారింది.
#RajaPriya క్రైస్తవ మతాచారం ప్రకారమే వైఎస్ షర్మిల కొడుకు పెళ్ళి...వీడియో ఇదిగో...
మండలి హనుమంతరావు దివంగత వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడిగా పేరుంది. గుడివాడలో కొడాలి నానికి కాకుండా హనుమంతరావు పేరును పరిశీలించడానికి కారణం ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ అడప బాబ్జి అనే కాపు నేతకి కొడాలి నాని సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. కానీ, అది నెరవేరలేదు. దీంతో అడప బాబ్జి మనస్థాపం చెందాడు. ఆ తరువాత గుండెపోటుకు గురై మరణించాడు. నానీ వల్లే అడప బాబ్జీ మృతి చెందాడని, గుడివాడలో నానీపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.
కాపుల్లో ఉన్న ఈ వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నెగిటివ్గా మారకూడదన్న ఆలోచనతోనే మరో కాపు నేత అయిన మండలి హనుమంతరావుకు టికెట్ ఇస్తున్నారని వినిపిస్తోంది. గుడివాడ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల పదివేల మంది ఓటర్లు ఉండగా.. అందులో 40 వేల ఓట్లు కాపు సామాజిక వర్గానికి చెందినవే. అవి పోగా మిగిలిన వాటిలో ఎస్సీ ఓటింగ్ ఎక్కువ. ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న వైసీపీ అధిష్టానం.. నానిని ఈ కారణాలతో పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు మండలి హనుమంతరావుకు ప్రజల్లో మంచి పేరుంది. కార్యకర్తలతో మంచిగా ఉంటాడన్న పేరు కూడా ఉంది. దీంతో ఈసారి గుడివాడ నుంచి కొడాలి నాని సీటు దక్కే అవకాశం లేదు. అయితే, నానిని బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా వీలైతే గన్నవరం నుంచి నానికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం యోచిస్తున్నట్లుగా సమాచారం.