లోకేష్ ను అంతమొందించడానికి వైసిపి కుట్ర...: బుద్దా వెంకన్న సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Jun 23, 2021, 11:19 AM IST
లోకేష్ ను అంతమొందించడానికి వైసిపి కుట్ర...: బుద్దా వెంకన్న సంచలనం

సారాంశం

టీడీపీ శ్రేణులు భయపడి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి పోరాడకుండా చేయాలనే విజయసాయి తప్పుడు కేసులతో చెలరేగుతున్నాడని బుద్దా వెంకన్న తెలిపారు.

విజయవాడ: అనేక అవినీతికేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి, ఉత్తరాంధ్రలోని టీడీపీకి చెందిన బలమైన బీసీనాయకులే లక్ష్యంగా కుట్రరాజకీయాలు నడుపుతున్నాడని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడుతో పాటు వారి కుటుంబసభ్యులు, అనుచరులపై రౌడీషీట్లు తెరవడం దుర్మార్గమని వెంకన్న ఆగ్రహం వ్యక్తంచేశారు. 

టీడీపీ శ్రేణులు భయపడి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి పోరాడకుండా చేయాలనే విజయసాయి ఇటువంటి తప్పుడు కేసులతో చెలరేగుతున్నాడని వెంకన్న తెలిపారు. ప్రభుత్వం తప్పుడుకేసులపెట్టి 80రోజులు జైల్లోపెట్టినా అచ్చెన్నాయుడు ఎక్కడా వెరవకుండా, వెనకడుగు వేయకుండా పాలకుల దుర్మార్గాలపై పోరాడుతూనే ఉన్నారన్నారు. పోలీసులు చేతిలో ఉన్నారుకదా అని అడ్డగోలుగా వ్యవహరించడం, చంపేస్తాము.. పొడిచేస్తామని బెదిరించడం ఎంతమాత్రం సరైందికాదని బుద్దా హితవు పలికారు. 

రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే పాలకుల చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ టీడీపీ సాగనివ్వదన్నారు. చంద్రబాబు నాయుడిని, లోకేశ్ ను బెదిరించి పబ్బం గడుపుకోవాలని అధికారపార్టీ చూస్తోందన్నారు. టీడీపీ కార్యకర్తలను కర్నూల్లో దారుణంగా హతమార్చారని, దానిపై ఆవేశంతో లోకేశ్ మాట్లాడితే దానికే ఆయనపై వీరంగం వేస్తున్నారని వెంకన్నమండిపడ్డారు. లోకేశ్ ఏదో అన్నాడంటూ ఆయన్ని చంపేస్తాము... పొడిచేస్తామనే వారంతా రోజులు  ఎప్పుడూ ఒకేలా ఉండవనే వాస్తవాన్ని గ్రహిస్తే మంచిదన్నారు.  

read more  ఏపీలో ఇంత జరుగుతుంటే ఉదాసీనంగా వుంటారేంటి...: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమీషన్ కు వర్ల ఘాటు లేఖ

చంద్రబాబు నాయుడి వారసుడైన లోకేశ్ ను అంతమొందిస్తే ఇక తమకు అడ్డుఉండదనే ఆలోచనలో అధికారపార్టీ ఉన్నట్టుందని బుద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ లోకేశ్ ని గానీ, చంద్రబాబు నాయుడి మనుషులనుగానీ టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని వెంకన్న తీవ్రస్వరంతో హెచ్చరించారు.  అధికారులు, పోలీసులుచేతిలో ఉన్నారుకదా అని ఏం మాట్లాడినా, ఏం చేసినా చెల్లుతుందనుకుంటే, అంతకంటే మూర్ఖత్వం ఉండబోదన్నారు. 

లోకేశ్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పాలిగానీ, రాజకీయాల్లో ఎవరూ అనని మాటలను అధికారపార్టీ నేతలు వాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన మంత్రులను కట్టడిచేయాలని, అవసరమైతే వారికి ఎలామాట్లాడాలో, ప్రజలతో ఎలా వ్యవహరించాలో శిక్షణ ఇప్పించాలని వెంకన్న సూచించారు. 

అచ్చెన్నాయుడిని భయపెట్టడానికి పెట్టిన తప్పుడు కేసులు, రౌడీషీట్లను డీజీపీ, ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు గుడ్డెద్దులా ప్రతిపక్షనేతలపైకి వస్తుంటే వారిని అడ్డుకోవడానికి చట్టాలు, న్యాయస్థానాలున్నాయన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, వారి అనుచరులపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని బుద్దా వెంకన్న వెల్లడించారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Sensational Comments: మేము అధికారంలోకి వస్తే వాళ్లందరూ జైలుకే | Asianet News Telugu
డ్రెయిన్స్ పొల్యూషన్ లేకుండా చెయ్యండి:Chandrababu on Make Drains Pollution Free| Asianet News Telugu