మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైల్లో పడి ఇబ్బందుల్లో వుంటే ఆయన కొడుక లోకేష్ భయంతో డిల్లీకి పారిపోయాడని వైసిపి నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు.
బాపట్ల : కన్నతండ్రి చంద్రబాబు నాయుడు ఇబ్బందుల్లో వుంటే కొడుకు నారా లోకేష్ డిల్లీకి పారిపోయాడని వైసిపి ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఎద్దేవా చేసారు. తండ్రికి అండగా ఇక్కడేవుండి చావో రేవో తేల్చుకోవాల్సిన లోకేష్ భయంతో పారిపోయాడని... డిల్లీలో తలదాచుకున్నాడని అన్నారు. తండ్రి అరెస్ట్ గురించి కాదు ఎక్కడ తనను అరెస్ట్ చేస్తారోనని భయపడే లోకేష్ రాష్ట్రానికి రావడంలేదని వైసిపి ఎంపీ పేర్కొన్నారు.
రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వ పథకాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమం గురించి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ వివరించారు ఎంపీ మోపిదేవి. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ పైనా ఆయన స్పందించారు.
వీడియో
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు సిఐడి విచారణకు సహకరించడం లేదని మోపిదేవి అన్నారు. ఈ కేసును పక్కదోవ పట్టించేలా ఆయన వ్యవహారతీరు వుందన్నారు. తండ్రి కొడుకులు విచారణ అధికారులకు సహకరించాలని వైసిపి ఎంపీ సూచించారు.
Read More అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు : చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా
తండ్రి చంద్రబాబు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినవెంటనే కొడుకు లోకేష్ డిల్లీ పారిపోయాడని మోపిదేవి అన్నారు. జాతీయ నాయకుల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నాడని అన్నారు. దొడ్డిదారిలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నా ఫలితంలేకుండా పోయిందన్నారు. చంద్రబాబు గురించి అందరికీ తెలుసుకాబట్టే ఎవరూ అండగా నిలవడం లేదని అన్నారు. డిల్లీ వెళ్లి పని ముగించుకుని రెండురోజుల్లో తిరిగిరావచ్చు... కానీ లోకేష్ అక్కడే మకాం వేసాడన్నారు. ఇన్నిరోజులు లోకేష్ డిల్లీలోనే ఎందుకున్నాడు? భయంతో పారిపోయి తలదాచుకున్నాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయని మోపిదేవి పేర్కొన్నారు.
తండ్రీకొడుకులు చంద్రబాబు, లొకేష్ అనేక కేసుల్లో ముద్దాయిలుగా వున్నారని మోపిదేవి తెలిపారు. కాబట్టి చంద్రబాబుకు బెయిల్ ఎప్పుడొస్తుందనేది న్యాయస్థానాల్లో తేలాల్సి ఉందన్నారు. చేతిలో అధికారం వుందికదా అని అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తగిన శిక్ష అనుభవించాల్సిందేనని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు.