హైదరాబాద్‌లో వుంటున్నారని.. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారా: బాబుపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు

Siva Kodati |  
Published : Jul 21, 2021, 07:09 PM IST
హైదరాబాద్‌లో వుంటున్నారని.. తెలంగాణకు అనుకూలంగా మాట్లాడతారా: బాబుపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు

సారాంశం

సీమకు జరిగిన అన్యాయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. 796 అడుగులు దాటకుండా తెలంగాణ నీళ్లు తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరా రెడ్డి ఎక్కడికి వెళ్లారని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు వైసీపీ నేత, రాయచోటీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో టీడీపీ నేతలు దిట్ట అంటూ చురకలు వేశారు. ప్రాజెక్ట్‌లపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు తమ విధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని.. రాయలసీమ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పోరాడుతామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీమకు జరిగిన అన్యాయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. 796 అడుగులు దాటకుండా తెలంగాణ నీళ్లు తోడేస్తుంటే చంద్రబాబు, మైసూరా రెడ్డి ఎక్కడికి వెళ్లారని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు.

ALso Read:రాయలసీమ ఎత్తిపోతలతో వెలిగొండకు నీరు రాదు: ఏపీ సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్యేల మరో లేఖ

హైదరాబాద్‌లో నివాసం వుంటున్నారు కాబట్టి భయపడ్డారా అంటూ ఆయన సెటైర్లు వేశారు. పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌లకు నీటిని తరలించి రాయలసీమను ఎందుకు ఎండగడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. రాయలసీమ హక్కులను కాపాడేందుకే తమ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని.. గ్రేటర్ రాయలసీమ పరిధిలోని ప్రాజెక్ట్‌లకు కేటాయింపులు జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

శ్రీశైలంలో నీటి కేటాయింపులు జరిగినా విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని తోడేస్తుందని.. ఇది న్యాయమా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. నీటి కేటాయింపులను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని.. రాయలసీమ ప్రాజెక్ట్‌లపై వైఎస్ఆర్, వైఎస్ జగన్‌లకు తప్ప ఏ ఒక్కరికి చిత్తశుద్ధి లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ల పనులపై జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu