పబ్లిసిటీ కోసం సామాన్యుల బలి.. పొత్తు లేకుండా గెలవగలరా.. సీబీఐ విచారణ ఎదుర్కోగలరా: రోజా

First Published Jul 15, 2018, 2:00 PM IST
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సీఎం రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్లలో సీఎం రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ జరగలేదని వారిని మరింత అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు.. ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చినట్లు టీడీపీ ప్రచారం చేస్తోందని.. ధైర్యముంటే మ్యానిఫెస్టోను తిరిగి వెబ్‌సైట్‌లో పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

పోలవరాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారని.. నితిన్ గడ్కరీ పర్యటనలో ఆయన బండారం బయటపడిందని ఎద్దేవా చేశారు. ఆయనకు ఎన్నికలకు సింగిల్‌గా వెళ్లే ధైర్యం లేదని.. మూడు సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకుంది టీడీపీనేనని ఆమె గుర్తు చేశారు.. అలాంటి తెలుగుదేశం తమ పార్టీ బీజేపీతో కలుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.

మీటింగ్‌లు, ట్వీట్లు పెట్టడం కాదని.. ధైర్యముంటే సీబీఐ విచారణను ఎదుర్కోవాలని రోజా సవాల్ విసిరారు. పబ్లిసిటీ పిచ్చి కోసం ముఖ్యమంత్రి సామాన్యులను బలిచేశారని.. నేటి వరకు గోదావరి పుష్కర బాధితులకు న్యాయం జరగలేదన్నారు.. విద్యార్ధులను  ప్రభుత్వ కార్యక్రమాలకు తీసుకెళ్లి వారి కుటుంబాల్లో శోకాన్ని నింపారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఏం చేసినా కేసులు ఉండటం లేదని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.
 

click me!