రోజా జాబ్ మేళా సక్సెస్

First Published Nov 18, 2017, 7:37 AM IST
Highlights
  • వైసీపీ ఎంఎల్ఏ రోజా ఆధ్వర్యంలో పుత్తూరులో నిర్వహించిన జాబ్ మేళా సక్సెస్ అయింది.

వైసీపీ ఎంఎల్ఏ రోజా ఆధ్వర్యంలో పుత్తూరులో నిర్వహించిన జాబ్ మేళా సక్సెస్ అయింది. నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలన్న ఉద్దేశ్యంతో రోజా జాబ్ మేళాను నిర్వహించారు. అందుకు పలు కంపెనీలు కూడా సహకరిచాయనుకోండి. శుక్రవారం పుత్తూరులోని ఎస్ఆర్ఎస్ డిగ్రీ కాలేజీలో జరిగిన మేళాలో 41 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ మేళాలో 5560 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇంటర్వూలు తదితర ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత 840 మంది ఉద్యోగాల్లో ఎంపికయ్యారు. బహుశా ఓ ఎంఎల్ఏ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరగటం ఇదే ప్రధమమేమో.

ఈ మేళాలో వరుణ్ మోటార్స్, లార్వెస్ట్ టెక్నాలజీస్, పోర్టియా సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్, హెచ్ జీఎస్, అపోలో ఫార్మసీ, పోలారీస్, ఫ్లిప్ కార్ట్, మెడ్ ప్లస్ లాంటి సంస్ధలు పాల్గొన్నాయి. ఎంపికైన వారికి మూడు రోజుల్లో నియామక ఉత్తర్వులు పంపుతామని కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ఎంపికైన వారిలో 550 మంది మహిళలుండటం గమనార్హం. అదే విషయమై రోజా మాట్లాడుతూ, ఒకరికి కుటుంబంలో ఉద్యోగం వస్తే కుటుంబం మొత్తానికి భరోసా కల్పించినట్లే అని అభిప్రాయపడ్డారు.

నియోజకవర్గంలో పర్యటించే సమయంలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పడే ఇబ్బందులను గమనించానని చెప్పారు. అందుకే పలు కంపెనీలతో చర్చించి జాబ్ మేళాను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని నిర్వహిస్తానని కూడా రోజా పేర్కొన్నారు. కాకపోతే ఎంపికైన వారందిరికీ నియామక ఉత్తర్వులు వచ్చి వారందరూ ఉద్యోగాల్లో చేరేలా చూడటం రోజా బాధ్యతే.

click me!