నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్శిటి సమ్మిట్ కు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అమరావతి సెగ తగిలింది. రోజా వాహనాన్ని మహిళలు, రైతులు అడ్డగించి అమరావతికి న్యాయం జరగాలని నినాదాలు చేశారు.
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజాకు అమరావతిలో చుక్కెదురైంది. మంగళగిరిలో ఆమెకు నిరసన సెగ తగిలింది. రోజా పర్యటనను అడ్డగించేందుకు రైతులు, మహిళలు ప్రయత్నించారు.
నీరుకొండ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం సమ్మిట్ లో పాల్గొనేందుకు గురువారం వచ్చిన రోజాను మహిళలు, రైతులు అడ్డుకున్నారు. ఆమె వాహనం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అమరావతికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం వెలుపల కూడా మహిళలు, రైతులు ఆందోళనకు దిగారు.
అమరావతి నుంచి కార్యనిర్వహణ, న్యాయ విభాగాలను తరలించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు ఆందోళన సాగిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రోజా వాహనాన్ని అడ్డగించారు.
ఇదిలావుంటే, అమరావతి ఆందోళనలు 65వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, మందడంలో మహా ధర్నాలు నిర్వహిస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరాహారదీక్ష 65వ రోజుకు చేరుకుంది. రాయపూడి,పెదపరిమి, తాడికొండ అడ్డ రోడ్డు వద్ద నిరసన దీక్షలు సాగుతున్నాయి.