రాధాకృష్ణపై సుప్రింకోర్టులో కేసు ?

First Published Jan 14, 2018, 10:07 AM IST
Highlights
  • వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణను కూడా వదిలేట్లు లేరు.  

కోర్టు కేసులతో చంద్రబాబునాయుడును ముప్పుతిప్పలు పెడుతున్న వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణను కూడా వదిలేట్లు లేరు.  ఏబిఎన్ రాధాకృష్ణపై సుప్రింకోర్టులో కేసు వేయటానికి ఆళ్ళ రంగం సిద్దం చేసుకుంటున్నారు. అసలు రాధాకృష్ణపై ఎంఎల్ఏ కోర్టులో కేసు ఎందుకు వేస్తున్నట్లు?

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సిందే. పోయిన సంవత్సరం వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా వీరిద్దరి భేటీ జరిగింది. భేటీ తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఏ అభ్యర్ధికి మద్దతు ఇవ్వటానికే తాను ప్రధానిని కలిసినట్లు మీడియాతో చెప్పారు. పనిలో పనిగా రాష్ట్ర సమస్యలు ప్రస్తావించటంతో పాటు ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని అడిగినట్లు కూడా చెప్పారు.

వారిద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఏమి జరిగిందన్న విషయం మూడో కంటికి తెలిసే అవకాశం లేదు. ప్రధానితో భేటీలో ఎవరు ఏమి మాట్లాడుకున్నా తర్వాత వారు బయటకు వచ్చి చెప్పిందే రాయాలి. అయితే, జగన్ చెప్పిన విషయంపై ఏబిఎన్ లో ‘అమ్మా జగనా’ అంటూ పెద్ద కథనం ప్రచురితమైంది. జగన్ తన వ్యక్తిగత అవసరాల కోసమే ప్రధానితో భేటీ అయినట్లు కథనం సాగింది. దాంతో వైసిపికి మండింది.

ఆ విషయంపైనే వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏబిఎన్ సంస్ధ ఎండి రాధాకృష్ణపై  నాంపల్లి  కోర్టులో కేసు వేశారు. జగన్ పరువుకు భంగం కలిగే విధంగా కథనం ఉందంటూ నాంపల్లి కోర్టులో పరువునష్టం కేసు వేశారు. సరే, తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే.  ఆళ్ళ పిటీషన్ పై రాధాకృష్ణ హై కోర్టుకు వెళ్ళారు. సరే, చివరకు హై కోర్టు ఆళ్ళ పిటీషన్ను కొట్టేసింది.. ఆ విషయంపైనే ఎంఎల్ఏ త్వరలో సుప్రింకోర్టుకు వెళ్ళటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నాంపల్లి కోర్టులో తనకు న్యాయం జరగలేదని ఆళ్ళ అంటున్నారు.

అదే విషయమై ఎంఎల్ఏ ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ కు వ్యతిరేకంగా ఏబిఎన్ లో కథనం వచ్చిందన్నారు. ‘చంద్రబాబునాయుడు ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఎప్పుడైనా జగన్ మీడియాలో ‘ఓటుకునోటు’ కేసులో నుండి బయటపడేయమని ప్రాధేయ పడటానికే కలిసినట్లు కథనం వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. వాళ్ళిద్దరి భేటీ తర్వాత చంద్రబాబు ఏమి చెబితే అదే అందరూ రాస్తున్న విషయాన్ని ఎంఎల్ఏ గుర్తు చేశారు. రాధాకృష్ణపైన తాను వేసిన కేసును ఇక్కడ కొట్టేసినా తాను మాత్రం సుప్రింకోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

 

 

 

 

click me!