‘అనర్హత వేటు’ పేరుతో బెదిరింపులా ?

First Published Nov 5, 2017, 11:56 AM IST
Highlights
  • అసెంబ్లీ బహిష్కరణ అంశంపై అధికార టిడిపి ప్రధాన ప్రతిపక్షం వైసీపీని బెదిరిస్తోందా?
  • జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

అసెంబ్లీ బహిష్కరణ అంశంపై అధికార టిడిపి ప్రధాన ప్రతిపక్షం వైసీపీని బెదిరిస్తోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ‘అనర్హత వేటు’ పేరుతో వైసీపీ సభ్యులను లొంగదీసుకోవాలని టిడిపి యోచిస్తున్నట్లు కనబడుతోంది.  ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని, ఫిరాయింపు మంత్రులను మంత్రివర్గంలో నుండి తప్పించాలన్న డిమాండ్లతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిచాలని వైసీపీ నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే, అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం సమావేశాలను బహిష్కరిస్తామని చేసిన ప్రకటనతో టిడిపి ఆత్మరక్షణలో పడిపోయింది. రాజకీయ పార్టీల్లో కూడా ఈ విషయమై బాగా చర్చ జరుగుతోంది. దాంతో ఏం చేయాలో టిడిపికి అర్ధం కాలేదు. ఒకవైపు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావాలని అంటూనే మరోవైపు చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు, నేతలు వైసీపీని నోటికి వచ్చినట్లు తిడుతున్నారంటేనే వారి ఆలోచనేంటో అర్ధమైపోతోంది.

ఇదిలావుండగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఓ చానల్ తో మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సిందిగా తాను వైసీపీ ఎంఎల్ఏతో మాట్లాడినట్లు చెప్పారు. వరుసగా మూడు అసెంబ్లీ సెషన్లకు హాజరుకాకుంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని కోడెల చెప్పారు. దాంతో కోడెల మాటలపై వైసీపీ మండిపడుతోంది. కోడెల మాటలు బ్లాక్ మైలింగ్ లాగుందని పలువురు ఎంఎల్ఏలు భావిస్తున్నారు.

అయితే, ఎంఎల్ఏల సస్పెన్షన్లకు సంబంధించి అసెంబ్లీలో మూడు సెషన్లు అని ఏ నిబంధనలోనూ లేదని నిపుణులు చెబుతున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం ‘ఒక సభ్యుడు స్పీకర్ అనుమతి తీసుకోకుండా వరుసగా 60 వర్కింగ్ డేస్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోతే అప్పుడు ఆ సభ్యునిపై అనర్హత వేటు వేయవచ్చ’ని ఉందంటున్నారు. అంతే కానీ స్పీకర్ చెబుతున్నట్లు మూడు సెషన్లు అని ఎక్కడా లేదట. సభ్యుని సస్పెన్షన్ విషయమై అసెంబ్లీ నిబంధన అంత స్పష్టంగా ఉన్నపుడు స్పీకర్ మూడు సెషన్లని ఎలా చెబుతున్నారో అర్ధం కావటం లేదు.

ఒకవేళ వైసీపీ సభ్యులను సభనుండి సస్పెండ్ చేయాలని అదికార పార్టీ గట్టిగా నిర్ణయించుకుంటే మొత్తం 60 రోజుల వర్కింగ్ డేస్ ను మూడు సెషన్లలో పూర్తి చేసే ఉద్దేశ్యంలో ఏమన్నా ఉన్నారా అన్న అనుమానం వస్తోంది. ఎందుకంటే, గడచిన మూడున్నరేళ్ళలో అసెంబ్లీ జరిగింది కేవలం 80 రోజులే. మరి మిగిలిన ఏడాదిన్నరలో 60 రోజులు సభ జరగటం కష్టమే. అసెంబ్లీలో వైసీపీ సభ్యులే ఉండకుండా చేయాలని అధికారపార్టీ అనుకుంటే మాత్రం టిడిపి ఎంతకైనా తెగించవచ్చు.

 

click me!