కాపు ప్రముఖులపై వైసీపీ ఫోకస్ .. ముద్రగడ కుటుంబంతో టచ్‌లోకి, పద్మనాభం కుమారుడితో మంతనాలు

By Siva KodatiFirst Published Mar 2, 2024, 2:40 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు నేతలను వైసీపీ టార్గెట్ చేసింది. జనసేన పార్టీకి మొన్నటి వరకు కాపు సామాజిక వర్గ పెద్దలుగా, ముఖ్య నాయకులుగా ఉన్న ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యలు మద్దతు పలికారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కూడా వైసీపీలోకి తెచ్చేందుకు వైసీపీ పావులు కదుపుతోంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాపు నేతలను వైసీపీ టార్గెట్ చేసింది. రాష్ట్రంలోని అభ్యర్ధుల గెలుపొటములను శాసించగల ఈ సామాజిక వర్గం మద్ధతును కూడగట్టేందుకు శ్రమిస్తోంది. జనసేన పార్టీకి మొన్నటి వరకు కాపు సామాజిక వర్గ పెద్దలుగా, ముఖ్య నాయకులుగా ఉన్న ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యలు మద్దతు పలికారు. కానీ, తాడేపల్లిగూడెం సభలో జరిగిన పరిణామాలు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వీరిద్దరూ గాయపడ్డారు. పవన్ కళ్యాణ్ పార్టీ మరిన్ని సీట్లు అడగాల్సిందని, అధికారంలోనూ వాటా అడగాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు హరిరామ జోగయ్య పలుమార్లు పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖలు కూడా రాశారు.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల పరిణామాలు ముఖ్యంగా, టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాల ప్రకటనలు వెలువడ్డాక పలువురు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే చేగొండి సూర్యప్రకాశ్ జనసేన పార్టీ విడిపెట్టారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. చేగొండి సూర్య ప్రకాశ్‌కు సీఎం జగన్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

మరో కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కూడా వైసీపీలోకి తెచ్చేందుకు వైసీపీ పావులు కదుపుతోంది. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ పెద్దలు టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలకు సంబంధించి పలు రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రపోజల్‌పై ముద్రగడ గిరి.. తన తండ్రితో చర్చించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాల పరంగా తన తండ్రి మాటను కాదనేది లేదని గిరి తేల్చిచెప్పారు. గతంలోనూ వైసీపీ నేతలు ఇలాగే ఇంటికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం , ఇతర రాయబారాలు నడిపారు తప్పించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడాన్ని ముద్రగడ అనుచరులు గుర్తుచేసుకుంటున్నారు. అందుకే వైసీపీ సైతం ఆచితూచి అడుగులు వేస్తోంది. 

click me!