
తిరుపతి : కాపు సంక్షేమ సేన అధ్యక్షులు, మాజీ మంత్రి హరి రామజోగయ్యతో జనసేన సంబంధాలు ఇక పూర్తిగా తెగిపోయాయి. ఇంతకాలం ఆయన తనయుడు చేగొండి సూర్యప్రకాష్ పార్టీలో కొనసాగడం, అధ్యక్షులు పవన్ కల్యాణ్ తో సన్నిహిత సంబంధాలు వుండటంతో జనసైనికులు జోగయ్యను గౌరవించేవారు. ఆయన జనసేన పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తూ వాటిని అమలుచేసి తీరాలన్నట్లుగా పవన్ కు లేఖలు రాసినా సహించారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది... ఇటీవల స్వయంగా పవనే తనను ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని జోగయ్యలాంటి వారిని పరోక్షంగా హెచ్చరించారు. ఇక తాజాగా ఆయన తనయుడు సూర్యప్రకాష్ వైసిపిలో చేరడంతో జనసేన నాయకులు హరి రామజోగయ్యపై భగ్గుమంటున్నారు.
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ అయితే హరి రామజోగయ్య ఇటీవల పవన్ కు రాసిన లేఖలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కన్నకొడుకే ఆయన మాట వినడంలేదు... అలాంటిది పవన్ ఎందుకు వింటాడని అన్నారు. పవన్ ఆయనను గౌరవించాడు కాబట్టే ఇలా వరుస లేఖలు రాయగలిగాడు... ఇప్పుడు వైసిపికి దగ్గరయ్యారుగా... అలాగే సీఎం జగన్ కు సలహాలిస్తూ లేఖలు రాయగలరా? అని ప్రశ్నించారు. కాపులకు 40 సీట్లు ఇవ్వాలని... పవర్ షేరింగ్ కావాలని సీఎం జగన్ కు లేఖ రాసే దమ్ముందా? అని హరి రామజోగయ్యను నిలదీసారు కిరణ్ రాయల్.
సలహాలు ఇవ్వొద్దని పవన్ చాలా స్పష్టంగా చెప్పారు... కాబట్టి సీనియర్ల ముసుగులో ప్రేమలేఖలు రాయడం ఆపాలని కిరణ్ సూచించారు. జగన్ లాంటి రాక్షసుడిని తరిమికొట్టాలంటే యుద్దం చేయాలి... పాతకాలంలో మాదిరిగా లేఖ రాజకీయాలు ఇప్పుడు పనిచేయవన్నారు. రాజకీయాల గురించి పవన్ కు అన్నీ తెలుసు... ఆయనకు ఉన్నంత స్పష్టత మరెవరికీ లేదన్నారు. ఉచిత సలహాలతో లేఖలు రాసి గౌరవాన్ని దిగజార్చుకోకండి... వీటితో పెన్ను, అందులో ఇంకు, పేపర్ బొక్క తప్ప ఎవరికి ప్రయోజనం వుండదని హరి రామజోగయ్యకు కిరణ్ చురకలు అంటించారు.
ఇక మీ ఖర్మ... నేనేమీ చేయలేను..: పవన్, చంద్రబాబుకు జోగయ్య ఘాటు లేఖ
పవన్ కల్యాణ్ తో పాటు జనసైనికులు అమాయకంగా వున్నపుడు ఇలాంటి హరి రామజోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటివారి ఆటలు సాగాయి... కానీ ఇప్పుడలా కాదన్నారు. కాపులు ఎవరూ వీరిని నమ్మడం లేదు... అందువల్లే వారిలో ప్రస్ట్రేషన్ పెరిగి పవన్ పడుతున్నారని అన్నారు. నిజంగానే మీకు పవన్ పై అంత ప్రేమే వుంటే వైసిపి నాయకులు ఆయనను విమర్శిస్తే ఎందుకు స్పందించలేదు... ఇలాగే వారికి లేఖలు ఎందుకు రాయలేదు? అని ప్రశ్నించారు. అప్పుడు మాట్లాడని మీరు ఇప్పుడు జనసేనను ఏదో ఉద్దరిస్తామన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారని కిరణ్ రాయల్ మండిపడ్డారు.
ఇక టిడిపి-జనసేన కూటమి తాడేపల్లిగూడెంలో నిర్వహించిన 'జెండా' సభ సూపర్ సక్సెస్ అయ్యింది... ఇది చూసి జగన్ ఆండ్ కో కు భయం పట్టుకుందని కిరణ్ అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ సభకు వచ్చేవారిని అడ్డుకున్నారు... అయినాకూడా సభాస్థలి కిక్కిరిసిపోయిందన్నారు. జనసేన కోసమో, టిడిపి కోసమో ఈ సభ పెట్టలేదు... వైసిపి పతనం కోసం పెట్టారు కాబట్టే ప్రజలు తండోపతండాలుగా విచ్చేసారని అన్నారు. దీన్నిబట్టి చూస్తే ఈసారి ప్రజలు బటన్ నొక్కితే రెండు దశాబ్దాల పాటు వైసీపీ కనిపించేలా లేదన్నారు. ప్రజల దెబ్బకు జగన్ అడ్రస్ గల్లంతు ఖాయమని కిరణ్ పేర్కొన్నారు.
వైసిపి నాయకులను చొక్కా మడతపెట్టాలని జగన్ ఇప్పుడు చెబుతున్నాడు... కానీ నాలుగేళ్ల క్రితమే జనసైనికులు చొక్కాలు మడత పెట్టారని అన్నారు. పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడటానికి జగన్ కు సిగ్గుండాలి... దమ్ముంటే రుషికొండలో ప్యాలెస్ ఎవరి కోసం కట్టారో చెప్పాలన్నారు. ప్రజల సొమ్ము రూ.450కోట్లతో ఆ భవనంలో ఏం కట్టారో చూపించాలని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేసారు.